Election Commission: మొత్తానికి కేంద్ర ప్రభుత్వం భారత ఎన్నికల సంఘానికి కొత్త కమిషనర్లను నియమించింది. గతంలో పనిచేసిన ఒక కమిషనర్ అను పాండే గత నెలలో పదవి విరమణ చేయడం, మరో కమిషనర్ అరుణ్ గోయల్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. ఈ పరిణామం వల్ల ఎన్నికల ముందు బిజెపి పై, ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఒత్తిడి పెరిగింది. దీంతో అటు విపక్షాలు, ఇటు పౌర సంఘాలు విమర్శలు చేయడం మొదలుపెట్టాయి. ఎన్నికలకు ముందు ఇది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందనే భావనతో ప్రధాని నరేంద్ర మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘానికి ఇద్దరు కమిషనర్లను నియమించారు.
ఎంపిక కమిటీలో ప్రధానమంత్రి తో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటులో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి కూడా ఉన్నారు. ప్రధాన మంత్రి ఆధ్వర్యంలో ఎలక్షన్ కమిషన్ భేటీ అయింది. ఆ తర్వాత కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్, హోంశాఖ కార్యదర్శి, శిక్షణ వ్యవహారాల శాఖ కార్యదర్శి సభ్యులుగా ఉన్న ఎంపిక కమిటీ ప్రతిపాదించిన పేర్ల జాబితా పై తీవ్రంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పదవి విరమణ చేస్తారు. న్యాయశాఖ కమిటీ ప్రకటించిన ఇద్దరు కమిషనర్లలో జ్ఞానేష్ కుమార్ కేరళ రాష్ట్రానికి చెందినవారు.. సుఖ్ భీర్ సింగ్ సంధు పంజాబ్ రాష్ట్రానికి చెందిన విశ్రాంత ఐఏఎస్. జ్ఞానేష్ కుమార్ 1988 ఐఏఎస్ బ్యాచ్ కేరళ లీడర్ కు చెందిన అధికారి.. ఈయన ఆర్టికల్ 370 సమయంలో కేంద్ర హోంశాఖలో పనిచేశారు. అప్పట్లో ఈయన సూచనల మేరకే కాశ్మీర్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. (అమిత్ షాకు అత్యంత ఇష్టమైన అధికారుల్లో ఈయన కూడా ఒకరనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి) కాశ్మీర్ డివిజన్లో పర్యవేక్షించారు. గతంలో అనేక మంత్రిత్వ శాఖలకు కార్యదర్శిగా పనిచేశారు. ఇక సుఖ్ భీర్ సింగ్ సంధు గతంలో పలు కేంద్ర శాఖలకు కార్యదర్శిగా పనిచేశారు.. నిక్కచ్చి అధికారిగా పేరుగడించారు..
కొత్త కమిషన్ల ఎంపికపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి వ్యవహార శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని నియమించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. “అంతకుముందు రాత్రి నాకు 212 పేర్లను పంపించారు. మళ్లీ సమావేశానికి 10 నిమిషాల ముందు ఆరుగురు పేర్లను చెప్పారు. ప్యానెల్ లో ప్రభుత్వానికి మెజారిటీ ఉంది. వారు కోరుకున్నదే జరిగింది. నాడు వాళ్లకు సహకరించిన వాళ్లకే పదవులు ఇచ్చారని” రంజన్ ఆరోపించారు.