Ghaziabad – Aligarh Express Way : జాతీయ రహదారుల నిర్మాణ సంస్థ(నేషనల్ హైవే అథారిటీ) నిర్మాణరంగంలో సరికొత్త రికార్డు సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్ అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణం రికార్డు సమయంలో పూర్తిచేశారు. కేవలం 100 గంటల్లో 100 కిలో మీటర్ల పొడవైన హైవేను నిర్మించినట్లు జాతీయ రహదారులు, రోడ్డు రవాణాశాఖ ప్రకటించింది. దీని ప్రకారం కేవలం నాలుగు రోజుల నాలుగు గంటల కాలంలోనే వంద కిలో మీటర్ల రోడ్డు నిర్మించి రికార్డు సృష్టించారు.
గ్రీన్ టెక్నాలజీ వినియోగం..
ఆర్థిక అభివృద్ధికి, పారిశ్రామిక ప్రాంతాలు, సాగు ప్రాంతాలను, విద్యా సంస్థలను ఈ ఎక్స్‌ప్రెస్ వే ఉపయెగపడుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కారి తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో ఘజియాబాద్ అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వేను రికార్డు సమయంలో నిర్మించారన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రి, గౌతమ్ బుద్ధ నగర్, సికందర్‌బాద్, బులంద్‌షహర్, ఖుర్జాలను కలుపుతూ సాగుతుందని వివరించారు. ఘజియాబాద్ అలీఘర్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణంలో గ్రీన్ టెక్నాలజీని వినియోగించినట్లు పేర్కొన్నారు. దాదాపు 90 శాతం మిల్లింగ్ మెటీరియల్‌ను ఉపయోగించినట్లు చెప్పారు. దీనివల్ల హైవే నిర్మాణ సమయంలో పర్యావరణానికి హాని కలిగించే ఉద్గారాలను గణనీయంగా తగ్గించినట్లు పేర్కొన్నారు. తద్వారా కార్బన్ ఫుట్ ప్రింట్ చాలా వరకు తగ్గుతుందని తెలిపారు.
గ్రీన్ టెక్ అంటే..
గ్రీన్ టెక్ అనేది దాని ఉత్పత్తి ప్రక్రియ లేదా దాని సరఫరా ఆధారంగా పర్యావరణ అనుకూలమైనదిగా పరిగణించబడే సాంకేతికత. పర్యావరణానికి తక్కువ హాని కలిగించే సాంకేతికత. దీని వినియోగంతో వాతావరణ మార్పులను నిరోధించడానికి కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్‌హౌస్ వాయువుల ఉద్గారాలను తగ్గిస్తుంది.
సంస్థాగత సామర్థ్యం పెంపు..
ఇది సహజ వనరులను సంరక్షించడానికి, జాతీయ రహదారుల సామర్థ్యం పెంచడానికి ఉపయోగపడుతుంది. రహదారి భద్రత డేటా విశ్లేషణలోనూ కీలకంగా ఉంటుంది. గ్రీన్ నేషనల్ హైవేస్ కారిడార్ ప్రాజెక్ట్ అమలు కోసం ప్రభుత్వం, ప్రపంచ బ్యాంకు రూ.500 మిలియన్ల ప్రాజెక్ట్‌పై సంతకం చేశాయి .
2015 నుంచే పాలసీ..
2015, సెప్టెంబరులోనే ‘గ్రీన్ హైవేస్ పాలసీ’ని ప్రకటించిన తర్వాత రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నేషనల్ గ్రీన్ హైవేస్ మిషన్‌ని ప్రారంభించింది. ఎంపిక చేసిన రాష్ట్రాల్లో సురక్షితమైన, పర్యావరణ హితమైన రహదారి కారిడార్‌లను నిర్మించడం గ్రీన్∙టెక్నాలజీ లక్ష్యం.
నాలుగు రాష్ట్రాలు ఎంపిక..
గ్రీన్ హైవే కారిడార్ అభివృద్ధి, నిర్వహణ కోసం కేంద్రం రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఆయా రాష్ట్రాల్లో 783 కి.మీ.ల జాతీయ రహదారులను ఐదేళ్లలో నిర్మించాలని నిర్‌నయిచింది. ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌తో సహా రైతులు, ప్రైవేట్ రంగం మరియు ప్రభుత్వ సంస్థల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పర్యావరణ అనుకూల జాతీయ రహదారి కారిడార్లను అభివృద్ధి చేస్తుంది. జాతీయ రహదారుల వెంట చెట్లు, పొదలను నాటడం ద్వారా వాయు కాలుష్యం మరియు దుమ్ము ప్రభావాన్ని తగ్గించడం దీని లక్ష్యం . అవి వాయు కాలుష్య కారకాలకు సహజ సింక్‌లుగా పనిచేస్తాయి. గట్ట వాలుల వద్ద నేల కోతను నిరోధిస్తాయి.