
ప్రజాస్వామ్య మనుగడలో అత్యంత కీలకమైన ఫోర్త్ ఎస్టేట్ గా పిలవబడే మీడియా.. భారతదేశంలో కూలిపోయిందా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు జనం! ప్రభుత్వానికి – ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ.. ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తేవడం మీడియా విధి. ప్రభుత్వాల లోపాన్ని ఎత్తిచూపుతూ.. అవసరమైతే తగిన సూచనలు కూడా చేయాల్సి ఉంది. కానీ.. ఇండియాలో కలం ఏనాడో పాలకులకు బానిసగా మారిపోయిందనే విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా.. కొవిడ్ పరిస్థితుల వేళ మరోసారి ఆ విషయం దేశానికి అర్థమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దేశంలో కరోనా మారణహోమం సృష్టిస్తోంది. కనీస వైద్యం అందక జనాలు అన్యాయంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలు శూన్యం. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్ భయాన్ని ఆదాయంగా మార్చుకుంటున్నారు. జనాల భయాన్ని క్యాష్ చేసుకుంటూ.. కోట్లాది రూపాయలను మూటగట్టుకుంటున్నారు. ఇక, బ్లాక్ మార్కెట్ దందా గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇలా.. ఒకటీ రెండు కాదు.. కరోనా కల్లోలంలో దేశాన్ని అక్రమాలు, అవినీతి కూడా పట్టి పీడిస్తున్నాయి.
వీటన్నింటినీ వెలికి తీయాల్సిన మీడియా.. మన్ను తిన్న పాములుగా పంకుంటోందనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. చివరకు అంతర్జాతీయ మీడియా.. భారతీయ మీడియాపై సెటైర్లు వేసినా.. దులుపుకొని వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిస్థితికి రకరకాల కారణాలు ఉన్నాయని అంటున్నారు. సామ,దాన,బేద,దండోపాయలతో ప్రభుత్వాలు దారిలోకి తెచ్చుకున్నాయని అంటున్నారు.
ఇందులో.. దాదాపు 90 శాతం మీడియాను కొనేశారన్నది బహిరంగ రహస్యమే. ఇక, మిగిలిన మీడియా సంస్థలు నిజాలను రాయాలనుకున్నా.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ సంస్థలతో దాడులు చేయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో.. ఆయా సంస్థలు కూడా వాస్తవాలను వెలికితీయలేని పరిస్థితి నెలకొందని అంటున్నారు.
కరోనా వంటి దారుణ కండీషన్లోనూ దేశంలో ఏం జరుగుతోందో ప్రజలకు నిజాలను చెప్పట్లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఢిల్లీ నుంచి రాష్ట్రాల వరకూ ఇదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. ప్రజల దైన్యాన్ని కవర్ చేసే ధైర్యం చేయలేకపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ.. మీడియా ప్రభుత్వాల భజన చేసే పనిలో ఉందని అంటున్నారు. భజన చేయని వారు వాస్తవాలను దాచి పెడుతూ మనకు ఎందుకొచ్చిన తంటా అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారనే విమర్శలు బాహాటంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో.. ఆయా మీడియా సంస్థలను ఏకిపారేస్తున్నారు.
నిజానికి ప్రపంచంలోని చాలా దేశాల్లో మీడియాపై కఠిన ఆంక్షలు ఉంటాయి. అయినప్పటికీ.. అక్కడ నిర్భయంగా వాస్తవాలను ప్రజలకు అందిస్తుంటాయి సంస్థలు. కానీ.. మన దేశంలో మాత్రం కనీస ధైర్యం చేయకుండా.. పాలకులకు భయపడి, వారు విసిరే మెతుకులకు ఆశపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో.. ఇక మీదట మీడియా ప్రజల పక్షం అని అనుకుంటే.. అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి లేదని అంటున్నారు.