https://oktelugu.com/

Delhi: డేంజర్ వేవ్.. ‘ఢిల్లీలో గాలి’ పీల్చలేం.. బతకలేం

గాలి లో నాణ్యత లేమి విషయంలో ఢిల్లీ నగరం మరోసారి పూర్ రికార్డ్ తన పేరిట నమోదు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా వరుసగా నాలుగోసారి ఢిల్లీ పేరు చరిత్రకెక్కింది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : March 19, 2024 / 02:33 PM IST

    Delhi worlds most polluted capital city again

    Follow us on

    Delhi: పీల్చే గాలి స్వచ్ఛంగా ఉంటేనే.. మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఆ గాలి నాణ్యత సరిగా లేకుంటే రోగాల బారిన పడతాడు. పెరుగుతున్న పారిశ్రామికీకరణ వల్ల రోజురోజుకు గాలిలో నాణ్యత తగ్గుతోంది. మిగతా ప్రాంతాల్లో కాస్త నయంగానే ఉన్నప్పటికీ.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత పాతాళానికి పడిపోతోంది. ఆ గాలిని పీల్చిన ప్రజలు రకరకాల వ్యాధుల బారిన పడుతున్నారు. శ్వాస కోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక ప్రతి ఏడాది శీతాకాలంలో వార్తల్లో ఉండే ఢిల్లీ నగరం.. ఈసారి వేసవి ప్రారంభానికి ముందే వార్తల్లో అంశమైంది.

    గాలి లో నాణ్యత లేమి విషయంలో ఢిల్లీ నగరం మరోసారి పూర్ రికార్డ్ తన పేరిట నమోదు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా వరుసగా నాలుగోసారి ఢిల్లీ పేరు చరిత్రకెక్కింది. స్విస్ దేశానికి చెందిన ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారక నగరాలు, దేశ రాజధానుల జాబితాను వెల్లడించింది. దీని ప్రకారం ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఢిల్లీలో గాలి నాణ్యత అత్యంత దారుణంగా ఉందని ఐక్యూ ఎయిర్ సంస్థ అభిప్రాయపడింది. “ఇక్కడ గాలి పీల్చడానికి చాలా ప్రమాదకరమని” ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. 2018 నుంచి వరుసగా నాలుగో సారి ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధానిగా ఢిల్లీ నగరం నిలవడం విశేషం. బీహార్ లోని బెగుసరాయి అనే ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత కాలుష్యకారక నగరంగా నిలిచింది.

    ఈ జాబితాలో కాలుష్యస్థాయిని సగటు వార్షిక PM 2.5 గాఢత తో క్యూబిక్ మీటర్ 54.4 మైక్రో గ్రాములుగా లెక్క కట్టారు. దీని ప్రకారం మొదటి రెండు స్థానాల్లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ నిలిచాయి. బంగ్లాదేశ్లో గాలి నాణ్యత క్యూబిక్ మీటర్ కు 79.9 మైక్రోగ్రాములు, పాకిస్తాన్లో క్యూబిక్ మీటర్ కు 73.7 మైక్రోగ్రాములుగా నమోదయింది. 2022లో క్యూబిక్ మీటర్ కు PM గాఢత 2.5 గా నమోదయింది. ఇది సగటున 53.3 మైక్రోగ్రాములుగా ఉంది. ఈ గణాంకాలు భారతదేశంలో నమోదయాయని ఐ క్యు ఎయిర్ ప్రకటించింది. ఫలితంగా భారత్ ఎనిమిదవ అత్యంత కాలుష్య దేశంగా నమోదయింది. 2023లో 8 నుంచి 3వ అత్యంత కాలుష్య దేశంగా భారతదేశం నిలిచింది. ఈ కాలుష్యం వల్ల 1.36 బిలియన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 2022 లో 131 దేశాలు, 7,323 ప్రాంతాలలో సమాచారాన్ని సేకరించారు. 2023 లో 134 దేశాలు, 7,812 ప్రాంతాలలో గాలి నాణ్యతను లెక్క కట్టినట్టు ఐ క్యు ఎయిర్ సంస్థ ప్రకటించింది. గాలి కాలుష్యం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 9 మరణాలలో ఒకటి కాలుష్యం కారణంగా సంభవిస్తోందని ఐ క్యూ ఎయిర్ సంస్థ వివరించింది. ప్రతి ఏడాది ఈ ఏడు మిలియన్ల ప్రజలు వాయు కాలుష్యం కారణంగా చనిపోతున్నారు. PM 2.5 కు చేరడం వల్ల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారు. కాలుష్యం వల్ల శ్వాస కోశ సంబంధిత సమస్యలు, క్యాన్సర్, గుండెపోటు, ఊపిరి తిత్తుల సంబంధిత వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.