Ram Mandir
Ram Mandir: భారతీయుల 500 ఏళ్ల కల సాకారం కాబోతోంది. ఇప్పటికే అయోధ్యలో పూర్తయిన రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సుముహూర్తం దగ్గర పడుతోంది. జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 గంటలకు అభిజిత్ లగ్నంలో రామ్ లల్లాకు ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. ఈమేరకు మోదీ కూడా అనుష్టానం చేస్తున్నారు. కఠిన దీక్షలో ఉన్నారు.
అయోధ్యలో ఆధ్యాత్మిక శోభ..
అయోధ్య నగరం అంతా రామమయమైంది. ఎటు చూసినా రాముని చిత్రాలు, శిల్పాలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. రామ నామం మార్మోగుతోంది. ఇక, రామాలయ ప్రారంభోత్సవానికి 7 వేల మంది అతిథులు రాబోతున్నారు. అయోధ్యలో అడుగు పెట్టగానే రామ నామం తప్ప మరేదీ కనిపించకుండా నగరం అంతా తీర్చిదిద్దారు. ఇక రామ్ లల్లా ఇప్పటికే అయోధ్య గర్భాలయానికి చేరుకున్నాడు. ప్రత్యేక పూజలు చేశారు.
నిర్మాణంలో ఆసక్తికర విషయం..
ఇదిలా ఉంటే.. అయోధ్య రామాలయ నిర్మాణంలో ఒక ఆసక్తికర విషయం తెలుగువారిని సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. అదే రామాలయ నిర్మాణానికి వాడిన సాంకేతిక పరిజ్ఞానం. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రామప్ప ఆలయ నిర్మాణానికి కాకతీయులు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్నే వాడారు. దీనినే శాండ్ బాక్స్ టెక్నాలజీ అంటారు. ఈ టెక్నాలజీ కారణంగా వెయ్యి ఏళ్ల వరకు ఆలయం చెక్కుచెదరకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాకతీయ సంస్కృతి పరిరక్షణ బృందంతో చర్చించి.. కాకతీయుల పురాతన సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుని అదే పరిజ్ఞానాన్ని రామాలయ నిర్మాణానికి వాడారు.
800 ఏళ్లుగా చెక్కు చెదరని కాకతీయుల ఆలయాలు..
కాకతీయులు నిర్మించిన ఎన్నో కట్టడాలు, కళాఖండాలు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 1200 సంవత్సరంలో కాకతీయులు ఈ ఆలయాలను నిర్మించారు. ఇప్పటికీ అవి సురక్షితంగా ఉన్నాయి. కాకతీయుల నిర్మాణంలో అద్భుతమైన ఇంజినీరింగ్ ప్రతిభ కనిపిస్తుంది. వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయాల నిర్మాణంలో కంకర, సున్నం లేకుండా కేవలం ఇసుకనే పునాదిగా చేసుకుని నిర్మించారు. ఇవి భారీ భూకంపాలను కూడా తట్టుకునేలా ఉన్నాయి. ఎలాంటి సాంకేతికత అందుబాటులో లేని కాలంలో కాకతీయులు ఉపయోగించిన పద్ధతే ఇప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణంలో ఉపయోగించారు.
నిర్మాణానికి అనువుగా లేని నేలలో..
రామప్ప ఆలయాన్ని కాకతీయులు పూర్తిగా నల్లరేగడి నేలలో నిర్మించారు. రామప్ప అంటే దేవుడి పేరు కాదు. ఆలయ నిర్మించిన శిల్పి పేరు. ప్రపంచంలో శిల్పి పేరుతో ఫేమస్ అయిన ఆలయం ఇదొక్కటే. సుమారు 40 ఏళ్లపాటు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే నిర్మాణానికి అనువుగా లేని నల్లరేగడి నేలలో సాండ్ బాక్స్ టెక్నాలజీ ఉపయోగించి నిర్మాణం చేపట్టారు. అడుగు భాగంలో ఇసుకను నింపి దానిపై శిలలను పేర్చుకుంటూ వచ్చారు. నిర్మాణం బరువుగా ఉండకుండా తేలికపాటి ఇటుకలనే ఉపయోగించారు. సాధారణంగా మనం వాడే ఇటుకల సాంద్రత 2.8 గా ఉంటుంది. కానీ రామప్ప ఆలయ నిర్మాణానికి వాడిన ఇటులక సాంద్రత కేవలం 0.8 మాత్రమే అందుకే ఈ ఇటుకలు నీటిలో వేస్తే తేలుతాయి. ఇలా తేలికపాటి బరువుతో ఆలయం నిర్మించారు.
అయోధ్య రామాలయంలోనూ..
అయోధ్య రామాలయ నిర్మాణంలోనూ పూర్తిగా కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. సరయు నది ఒడ్డున ఉన్న నేల ఆలయ నిర్మాణానికి అనువుగా లేకపోవడంతో సుమారు వెయ్యేళ్లు చెక్కు చెదరకుండా ఉండేలా రామ మందిరం నిర్మించాలని సంకల్పించిన సాంకేతిక నిపుణులు, అనేక ఆలయాల నిర్మాణ శైలులను పరిశీలించారు. చివరకు కాకతీయుల నిర్మాణ శైలిని ఎంపిక చేసుకున్నారు. 50 అడుగుల లోతు వరకు మట్టిని తీసి ఇసుకతో నింపారు. దానిపై బరువు తక్కువగా ఉండే రాజస్తాన్‌లోని ఎరుపు ఇసుక రాయితో నిర్మాణం చేపట్టారు. కాంక్రీటు బండ్ వేసి ఆలయం నిర్మిస్తే కేవలం వంద నుంచి 200 ఏళ్లు మాత్రమే ఉంటుందని భావించిన నిపుణులు.. కాకతీయుల సాంకేతిక పరిజ్ఞానంతో వెయ్యి ఏళ్ల వరకు రామ మందిరం చెక్కు చెదరకుండా ఉంటుందని ఆ పరిజ్ఞానంతో నిర్మించారు.