Congress Second List: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రావడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టిపెట్టాయి. అధికార బీజేపీ ఇప్పటికే 80 శాతం సీట్లను ప్రకటించింది. మిగతా సీట్లను కూడా త్వరగా ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా స్పీడ్ పెంచింది. అభ్యర్థులను త్వరగా ప్రకటించి ప్రచారంలోకి దిగాలని హస్తం నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా 50 మందితో రెండు లిస్టు రిలీజ్ చేసింది.
తెలంగాణలో ఐదుగురికి..
తాజాగా ప్రకటించిన రెండో జాబితాలో తెలంగాణ నుంచి ఐదుగురికి ఛాన్స్ దక్కింది. పెద్దపల్లి(ఎస్పీ) గడ్డం వంశీకృష్ణ, మల్కాజ్‌గిరి స్థానానికి సునీత మహేందర్‌రెడ్డి, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్(ఎస్సీ) నుంచి మల్లు రవి పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.
నలుగురు వలస నేతలే..
ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో టికెట్లు దక్కిన ఐదుగురిలో నలుగురు ఇటీవల కాంగ్రెస్‌లో చేరినవారే కావడం గమనార్హం. గడ్డం వంశీకృష్ణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన తండ్రి వివేక్‌తో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక పట్నం సునీతా మహేందర్‌రెడ్డి నెల క్రితం కాంగ్రెస్‌లో చేరారు. దానం నాగేందర్, రంజిత్‌రెడ్డి మూడు రోజుల క్రితమే కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. నలుగురిలో ముగ్గురు బీఆర్‌ఎస్ నుంచి వచ్చినవారే. రంజిత్‌రెడ్డి చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ, దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే, సునీతారెడ్డి రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్. వీరంతా బీఆర్‌ఎస్ టికెట్‌పై గెలిచినవారే.
తొలి జాబితాలో నలుగురు..
ఇక కాంగ్రెస్ ప్రకటించిన తొలి జాబితాలో తెలంగాణకు చెందిన నలుగురికి అవకాశం దక్కింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, నల్గొండ నుంచి కుందూర్ రఘువీర్, మహబూబ్‌నగర్ నుంచి చల్లా వంశీచందర్‌రెడ్డి, మహబూబాబాద్(ఎస్టీ) నుంచి బలరాం నాయక్ పేర్లును ప్రకటించింది. తాజాగా ఐదుగురిని ఎంపిక చేసింది. దీంతో మొత్తం 17 స్థానాలు ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటి వరకు 9 మందిని ఎంపిక చేసింది. మిగతా 8 మందిని కూడా త్వరగా ఖరారు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇంకా కరీంనగర్, ఖమ్మం, మెదక్, వరంగల్, భువనగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్, హైదరాబాద్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.