Congress: మినిమం సపోర్ట్ ప్రైస్.. స్థూలంగా ఎమ్మెస్పీ పై రైతు సంఘాలు మరోసారి హర్యానా రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నాయి. 2021లో చేసిన ఆందోళనల సమయంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 2.0 పేరుతో రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనలు ఉదృత రూపం దాల్చకముందే కేంద్ర ప్రభుత్వం మేల్కొంది. రైతు సంఘాలతో పలు విడతలుగా చర్చలు నిర్వహించింది. అయితే మినిమం సపోర్ట్ ప్రైస్ పై కేంద్రం కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో రైతు సంఘాలు తమ ఆందోళనలను తాత్కాలికంగా విరమించాయి. అయితే ఈ రైతుల ఆందోళనకు పరోక్షంగా ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల ముంగిట సరికొత్త రాజకీయాలకు పాల్పడుతోంది.
ఇప్పుడు రైతు కోణంలో మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ.. గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి పల్లవి అందుకుందో అందరికీ తెలుసు. మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో మినిమం సపోర్ట్ ప్రైస్ పై స్వామినాథన్ ఆధ్వర్యంలో ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ కనీస మద్దతు ధరకు సంబంధించి C2 ఫార్ములా అమలు చేయాలని సిఫారసు చేసింది. 2006లో నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక అమలుకు సంబంధించి అప్పటి యూపీఏ ప్రభుత్వం 8 సంవత్సరాలు కాలయాపన చేసింది. అంతే కాదు C2 ఫార్ములా కింద మినిమం సపోర్ట్ ప్రైస్ అమలు చేయడం కుదరదు అని ప్రకటించింది. 2010 ఏప్రిల్ 16న ఎగువ, దిగువ సభల్లో ప్రకటన చేసింది. మినిమం సపోర్ట్ ప్రైస్ అమలు చేస్తే మార్కెట్లో ధరలు ప్రభావితమవుతాయని ప్రకటించింది. ఉత్పత్తి, మద్దతు ధరల మధ్య అనుసంధానం కుదిరితే అది వ్యతిరేక ఫలితాలు ఇస్తుందని పార్లమెంటులో లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చింది.
అప్పట్లో బీజేపీ ప్రతిపక్షంలో ఉంది.. ఎంఎస్పీ అమలు చేస్తే మార్కెట్లో ఏర్పడే కష్టనష్టాల గురించి అర్థం చేసుకుంది కాబట్టి మాట్లాడలేదు. మరీ ముఖ్యంగా రాజకీయ లబ్ధి కోసం దేశ ప్రయోజనాలను పణంగా పెట్టి సిక్కు రైతులను రెచ్చగొట్టలేదు. దేశ రాజధాని ఢిల్లీ మీదికి ఎగదొయ్యలేదు. అప్పట్లో బాధ్యతయుతమైన ప్రతిపక్షంగా బిజెపి వ్యవహరించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెస్సీ విషయంలో వెసులుబాటు లభించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా అమలు చేయడం కుదరదు అని చెప్పిన ఎమ్మెస్పీ ని.. ఇప్పుడు అమలు చేయాలని కోరడం కాంగ్రెస్ పార్టీ దివాళ కోరు రాజకీయాలకు తార్కాణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట పంజాబ్ రాష్ట్రంలో రైతులను రెచ్చగొట్టి.. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. “కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం కంటే.. ప్రతిపక్షంలో ఉంటే దేశానికి చాలా ప్రమాదం అని” నాడు భారత ప్రధాని వాజ్ పేయి చేసిన వ్యాఖ్యలను వారు ఉటంకిస్తున్నారు..
కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు పంజాబ్, ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ కూడా రైతులతో రాజకీయాలు చేస్తోంది. కనీస మద్దతు ధర పేరుతో రైతులను రెచ్చగొట్టి ఢిల్లీ వీధుల్లోకి పంపిస్తోంది. పంజాబ్ ఎన్నికల సమయంలో స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామని ఆప్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని అమలు చేయకుండా.. ఆ రాష్ట్ర రైతులను మినిమం సపోర్ట్ ప్రైస్ కోసం కేంద్రం మీదికి ఉసిగొలుపుతోంది. పంజాబ్ రాష్ట్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో.. అక్కడి ప్రభుత్వ పెద్దల సూచనల మేరకు పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. పంజాబ్ రైతులు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నప్పటికీ మౌనంగా ఉంటున్నారు. ఈ ఉదంతంపై హైకోర్టు మొట్టికాయలు వేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మొత్తంగా అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ఆప్ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రైతులను బలి పశువులుగా వాడుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.