Cloud Bursting In Mawsynram: మనం బతికేందుకు నీరు కావాలి. ఆ నీరు కావాలంటే వర్షం కురియాలి. కురిసిన ఆ వాన నీటిని భూమి పీల్చుకోవాలి. భూమి ఆ నీటిని శుద్ధి చేసి భూగర్భజలంగా మార్చితే దాన్ని మనం వివిధ పద్ధతుల్లో తాగునీటిగా మార్చుకొని వాడుకుంటాం. మండే ఎండ నుంచి, ఉక్కిరి బిక్కిరి చేసే ఉక్కపోత నుంచి ఉపశమనం కావాలంటే వర్షం కురవాల్సిందే. జల్లు కురుస్తుంటేనే ఒళ్లంతా తుళ్ళింత అవుతుంది. కానీ 365 రోజులు అదే పనిగా వర్షం కురిస్తే ఎలా ఉంటుంది? మామూలుగానే కొద్ది రోజులు వర్షం కురిస్తేనే ఊళ్ళకు ఊర్లు మునిగిపోతాయి. ఇటీవల వర్షాలకు ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాలు ఎలా మునిగిపోయాయో చూసాం కదా.. ఆ స్థాయిలో కాకున్నా వర్షాలు రోజూ కురిస్తే అక్కడి ప్రజలు ఎలా జీవిస్తారు? ఎలా బతికి బట్ట కడతారు? తినేందుకు ఆహారాన్ని ఎలా సమకూర్చుకుంటారు? అయితే మాతో పాటు మాసిన్రామ్ రండి.. ఆగండి ఆగండి రండి అంటే బ్యాగు గట్రా సర్దుకుని వచ్చేద్దురు.. మీలో ఆసక్తి కలిగించేందుకు ఆ మాట అన్నాం. ఇప్పుడు ఇక చదవండి.

..
తేమ బాబోయ్ తేమ
..
మేఘాలయ.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.. ప్రకృతి పచ్చని కోక కడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ రాష్ట్రం. మేఘాలన్నీ దట్టంగా ఆవరించి ఉంటాయి కనుక ఈ రాష్ట్రానికి ఆ పేరు పెట్టారు. అస్సాంలోని చిరపుంజి ప్రాంతానికి దగ్గర్లోనే సరిహద్దు ప్రాంతంగా ఉంటుంది మాసిన్రామ్. “తొమ్మిది రాత్రులు.. తొమ్మిది పగళ్ళు” వర్షాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు మా సిన్రామ్ ప్రజలు చెప్పే మాట ఇది. అంటే దీనిని బట్టి అక్కడ వర్షాల తీవ్రత ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ ప్రాంతంలో సగటు వర్షపాతం 11,871 మిల్లీమీటర్లు. వామ్మో అంత వర్షమే.. అని నోరెళ్ళబెట్టారా? నిజంగానే ఆ స్థాయిలో వర్షం కురుస్తుంది కాబట్టే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో మాసిన్రాం చోటు దక్కించుకుంది. తూర్పు ఖాసీ కొండల ప్రాంతంలో మా సిన్రాం ఉండటం వల్ల జీవవైవిద్యం పాళ్ళు కూడా ఎక్కువే. బంగాళాఖాతం నుంచి వీచే గాలుల ద్వారా ఇక్కడ అత్యధికంగా తేమ ఉంటుంది. 1985లో ఇక్కడ ఒక ఏడాదిలో సుమారు 26 వేల మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది అప్పట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ లోకి ఎక్కింది. మాసిన్రామ్ లో జూన్ 16న 24 గంటల వ్యవధిలో 1003.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఒక్కరోజులోనే ఏడాదిలో కురిసే వర్షంలో పది శాతం నమోదయింది. 1966లో నమోదైన 945 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డును బద్దలు కొట్టింది.
…
జీవనశైలి విభిన్నం
..
మాసిన్రామ్ జనాభా నాలుగు వేలు. తరచూ ఇక్కడ వర్షాలు కురుస్తుండడం వల్ల వాతావరణం ఎప్పటికీ తేమగా ఉంటుంది. ప్రజల వస్త్రధారణ, ఆహారపు అలవాట్లు వేటికవే భిన్నంగా ఉంటాయి. స్థానికులు “నప్” గా పిలుచుకునే వెదురు గొడుగును ఎప్పటికీ తమ వెంట ఉంచుకుంటారు. దుస్తులను బయట ఆరవేసేందుకు అవకాశం ఉండదు కాబట్టి వాటిని మెటల్ డ్రైయర్ల లో ఉంచుతారు. ఇళ్ళల్లో హీటర్లు ఉంటాయి. తరచూ పొగ మంచు వ్యాపిస్తుండటం వల్ల ఇంట్లో గోడలు, వస్తువులు అన్ని తేమగా ఉంటాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వ్యవసాయం చేసే వీలుండదు కాబట్టి స్థానికులు చిన్నచిన్న వ్యాపారాలు నిర్వహించుకుంటారు. కూరగాయలు, ఇతరత్రా సరుకులను చిన్నచిన్న కవర్లలో చుట్టి విక్రయిస్తూ ఉంటారు. ఏటా మే నుంచి అక్టోబర్ వరకు కుండపోతగా వర్షాలు కురుస్తుంటాయి. ఆ సమయంలో సూర్యుడు పెద్దగా ఉదయించడు. కాబట్టి స్థానికులు బయటకు వెళ్లేందుకు ఇష్టపడరు. ఆ సమయంలో బంగాళదుంప, ఎండు మిరపకాయలు, టమాటా లతో చేసిన ప్రత్యేక వంటకాన్ని ఇష్టంగా తింటారు. ఇది వర్షాకాలం వేళ వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. అధిక వర్షపాతం నమోదు అవుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో రోడ్లు, వంతెనలు తరచూ మరమ్మతులకు గురవుతూ ఉంటాయి. వాటి నిర్వహణ కోసం ఏటా భారీ మొత్తంలో ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంటుంది. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో రబ్బరు, వెదురును ఉపయోగించి వంతెనలు నిర్మించారు. ఈ మధ్య ప్లాస్టిక్ వ్యర్ధాలను కరిగించి రోడ్లను నిర్మిస్తున్నారు. దట్టమైన అడవులు ఉండడంతో మాసిన్రామ్ ను సందర్శించేందుకు పర్యాటకులు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన అందాలకు ఇక్కడ కొదవ ఉండదు. ముఖ్యంగా మే నుంచి అక్టోబర్ నెల వరకు పొగ మంచు, దట్టమైన మేఘాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. మాసిన్రామ్ అటవీ ప్రాంతంలో ఉన్న మాజిమ్ బ్యూయిన్ గుహలను సందర్శించేందుకు పర్యాటకులు అమితాసక్తాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో స్థానికులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిధులు విడుదల చేసింది. ప్రస్తుతం వాటితో వివిధ రకాలైన పనులు జరుగుతున్నాయి. ఈ పనులను కూడా స్థానికులకే అప్పగించడంతో వారికి చేతినిండా ఉపాధి లభిస్తున్నది.