
H3N2 virus : కోవిడ్ తగ్గుముఖం పట్టింది. కానీ వాతావరణం మాల నేపథ్యంలో ఫ్లూ వైరస్ చుక్కలు చూపిస్తోంది. కొద్దిరోజులుగా దీని ప్రభావం తీవ్రంగా ఉంది.. ఫలితంగా జలుబు, వారాలపాటు కొనసాగుతున్న దగ్గు ప్రజలకు నరకం చూపిస్తోంది.. ఇలాంటి సమయంలో ఫ్లూ వైరస్ తో బాధపడుతున్నవారు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్ళు నొప్పుల వంటి లక్షణాలు ఉంటే దానిని ఫ్లూ జ్వరంగా అనుమానించాలని చెబుతున్నారు..దీనికి వైద్యులు హెచ్ 3 ఎన్2 గా నామకరణం చేశారు.
అయితే ఈ ఫ్లూ జ్వరంతో బాధపడేవారు విపరీతంగా యాంటీబయాటిక్స్ వాడకూడదని వైద్యులు చెప్తున్నారు.. వైరస్ సోకిన వారు డబ్ల్యూహెచ్వో సూచించిన “ఒసెల్టామివిర్” డ్రగ్ వాడాలని వివరిస్తున్నారు. ఇక దేశంలో ఈ వైరస్ వల్ల ఇప్పటికే ఇద్దరు కన్నుమూశారు. ఈ క్రమంలో వివిధ రాష్ట్రాల్లో పరిస్థితి పై నీతి ఆయోగ్ బృందం సమీక్షించింది. వైరస్ తో బాధపడేవారు విపరీతంగా యాంటి బయోటిక్స్ వాడకూడదని సూచిస్తున్నది.
స్వైన్ ఫ్లూ వైరస్ సాధారణ వేరియంటే హెచ్ 3 ఎన్ 2 అని, స్వల్ప స్థాయిలో మ్యూటేషన్లు జరగడంతో కేసులు వస్తున్నాయని వైద్యులు అంటున్నారు. బాధితులు మొత్తం రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారే చెబుతున్నారు. ఆస్పత్రిలో చేరికలు పెద్ద సంఖ్యలో లేనందువల్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. అయితే స్వైన్ ఫ్లూ ఇతర ఉపవారికలతో పోలిస్తే హెచ్3 ఎన్ 2 ప్రభావం ఎక్కువని, నిరంతరం దగ్గు, జ్వరం, శ్వాస కోశ సమస్యలు, వికారం, వాంతులు, గొంతు, ఒళ్ళు నొప్పులు, విరోచనాలు దీని లక్షణాలని చెప్తున్నారు. ఇదే సమయంలో గుండెజబ్బులు, శ్వాస కోశ సమస్యలు ఉన్నవారు, కిడ్నీ వ్యాధులు ఉన్నవారు జన సమూహంలోకి వెళ్ళేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కోవిడ్ తీవ్రత తగ్గిన నేపథ్యంలో ప్రజలు మాస్కులు వాడటం లేదని, ఇన్ ఫ్లూయంజా వైరస్ సులువుగా వ్యాప్తి చెందేందుకు ఇదీ ఒక కారణమని పేర్కొంటున్నారు.
ఓవైపు హెచ్3 ఎన్ 2 ప్రభావం అధికంగా ఉండగా, మరోవైపు దేశవ్యాప్తంగా ఉనికి చాటుతోంది. మూడు వారాలుగా దేశంలో కేసులు పెరిగాయి. గతవారం దాదాపు భారీగా కేసులు నమోదయ్యాయి.
ఇందులో దక్షిణ భారతదేశం, మహారాష్ట్రలదే ప్రధాన వాటా.. కాగా హెచ్ 3 ఎన్2 ప్రభావంతో రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఆరోగ్య కార్యకర్తలకు మాస్క్ ల ధారణ కచ్చితం చేయడంతో పాటు, అనవసరంగా గుమి కూడవద్దంటూ ఆంక్షలు విధించింది. ఈనెల పదిన వెయ్యి జ్వర నిర్ధారణ శిబిరాలు, 200 మొబైల్ క్లినిక్ లను ఏర్పాటు చేయాలని తమిళనాడు సర్కారు నిర్వహించింది. ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ బుద్ధ జిల్లాలో నెలాఖరు వరకు జనం గుమికూడకుండా 144 సెక్షన్ విధించారు.