Tax on Petrol: దేశంలో ధరలు భయపెడుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫలితంగా సామాన్యుడి జీవితం కష్టంగా మారుతోంది. పెట్రో ధరలు సైతం క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో అన్నింటిపై భారం పడుతోంది ఈ నేపథ్యంలో పెట్రోల్, గ్యాస్ ధరలు పెరుగుతుంటే బతుకుపై భరోసా కరువవుతోంది. పాలకుల నిర్లక్ష్యంతో పేదలు ఇంకా పేదలుగానే మిగిలిపోతున్నారు. పన్నులు కట్టేందుకు తమ ఒళ్లు హూనం చేసుకోవాల్సిందే తప్ప ప్రశ్నించడం మాత్రం చేతకావడం లేదు. ప్రజల బాధలు తీరుస్తామని చెప్పిన ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. దీంతో ధరలు పెరుగుదల ఇంకా కొనసాగుతూనే ఉంది.

కేంద్ర ప్రభుత్వానికి ఐదేళ్ల కిందట రూ.70 వేల కోట్లు వస్తే ఇప్పుడు రూ.నాలుగు లక్షల కోట్లు వస్తోంది. అంటే ప్రజలపై ఎంత మేర భారం పెరిగిందో అర్థం అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధర తగ్గినప్పుడల్లా ఎక్సైజ్ సుంకం పెంచడంతో సామాన్యులపై భారం పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నారు. దీంతో అన్ని వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధర దాదాపు రూ.110 చేరడం గమనార్హం.
పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తామని గతంలో ఆలోచించినా స్టేట్లు ఒప్పుకోవడం లేదనే సాకుతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. అదే జరిగితే పెట్రో ధరలు సగం అదుపులోకి వచ్చేవి. కానీ స్టేట్ల మీద నెపం వేసి కేంద్రం తప్పించుకుంటోంది. దీంతో ప్రజలు మాత్రం పెనుభారం మోస్తున్నారు. రోజంతా కష్టపడినా పెట్రోల్ కే ఖర్చు చేస్తూ బతుకు జీవుడా అంటూ నిట్టూరుస్తున్నారు. ధరలో రామచంద్రా అంటూ దేవుడిపై భారం వేస్తున్నారు.
ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన పాలకులు స్పందించడం లేదు. ప్రజలను నడ్డివిరిచే పన్నుల కోసమే ఆరాటపడున్నారు. ప్రజల బాధలు దేవుడెరుగు తమకెంత ఆదాయం వస్తుందని లెక్కలు వేస్తున్నారు. దీంతోనే ధరలు ఇలా పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పెట్రో ధరల పెరుగుదలను అడ్డుకునే ప్రయత్నాలు మాత్రం కేంద్రం చేయడం లేదనేది సత్యం.