BJP : ఏపీలో పొత్తులపై బీజేపీ హైకమాండ్ దృష్టిపెట్టిందా? కర్నాటక రిజల్ట్స్ తో దిగివచ్చిందా? అందుకే రాష్ట్ర బీజేపీ నాయకులు పొత్తులపై సానుకూలంగా మాట్లాడుతున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చనీయాంశంగా మారింది.2014 ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ మధ్య మైత్రి కుదిరింది. పవన్ కళ్యాణ్ సైతం కూటమికి మద్దతు తెలిపారు. దీంతో మంచి ఫలితాలు వచ్చాయి. అటు కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలే అధికారంలోకి వచ్చాయి. అయితే రాష్ట్ర విభజన హామీలు అమలుచేయడంలో కేంద్ర వైఖరిని నిరసిస్తూ చంద్రబాబు ఎన్డీఏకు దూరమయ్యారు. గత ఎన్నికల్లో మోదీపై చంద్రబాబు యుద్ధం ప్రకటించారు. కానీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో చంద్రబాబుకు తత్వం బోధపడింది.
చంద్రబాబు ప్రయత్నించినా..
బీజేపీని దూరం చేసుకున్నందునే తనకు ఓటమి ఎదురైందని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఎన్నికల అనంతరం బీజేపీ ప్రాపకం కోసం ప్రయత్నాలు చేస్తునే ఉన్నారు. కొంతమంది నాయకులను ఆ పార్టీలోకి పంపించారు కూడా. గత అనుభవాల దృష్ట్యా టీడీపీని దరి చేర్చుకోలేదు. చంద్రబాబు ఎన్నిరకాలుగా ప్రయత్నించినా వర్కవుట్ కాలేదు. అయితే ఇప్పుడు కర్నాటక లో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీయడంతో తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెంచారు. తెలంగాణలో బహుముఖ పోటీ నెలకొన్న నేపథ్యంలో ఏపీలో పొత్తులు తేలితే అటు టీడీపీ, జనసేన ఓటు బ్యాంక్ మారే అవకాశముందని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.
పవన్ హెచ్చరికలతోనే..
అయితే బీజేపీలో మార్పు వెనుక మాత్రం ఉన్నది ముమ్మాటికీ పవన్ కళ్యాణే. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఆయన హైకమాండ్ పెద్దలకు స్పష్టంగా చెప్పారు. కూటమి కడితేనే జగన్ సర్కారును గద్దె దించగలగమని చెప్పుకొచ్చారు. మీరు కలిసి రాకుంటే మాత్రం టీడీపీతో కలిసి వెళతానని తేల్చేశారు. దీంతో బీజేపీలో అంతర్మథనం ప్రారంభమైంది. ఇంతలో కర్నాటకలో సైతం ప్రతికూల ఫలితాలు వచ్చాయి. తెలంగాణలో సైతం అదే సీన్ తప్పదని సంకేతాలు వెలువడుతున్నాయి. దీంతో బీజేపీలో పునరాలోచన ప్రారంభమైంది. పొత్తులపై సీరియస్ గా దృష్టిపెట్టింది.
తగ్గిన విమర్శల దాడి..
ఒక వైపు పొత్తుల ప్రచారం జరుగుతుండగా.. రాష్ట్ర బీజేపీ నేతల స్వరం కూడా మారింది. ఇన్నాళ్లూ తమకు వైసీపీ, టీడీపీ సమదూరం అని చెబుతూ వస్తున్న బీజేపీ నాయకులు తమ స్వరాన్ని సవరించుకున్నారు. వైసీపీ సర్కారుపై విమర్శించే క్రమంలో టీడీపీనీ వదలిపెట్టని నాయకులు కాస్తా తగ్గుతున్నారు. టీడీపీ పై విమర్శలు చేయడమే మానేశారు. దీంతో ఢిల్లీలో చర్చలు ప్రారంభమయ్యాయన్న సమాచారంతోనే మాటలు తగ్గించారని ఏపీ పొలిటికల్ సర్కిల్ లో చర్చ నడుస్తోంది. అయితే పొత్తులపై క్లారిటీ వచ్చేందుకు మరికొద్దిరోజులు ఆగాల్సిందేనని తెలుస్తోంది