BJP : కర్నాటకలో ఓడిపోయినప్పటికీ మోదీ చరిష్మా ఇంకా తగ్గలేదు. పైగా గ్లోబల్ స్థాయిలో అంతకంతకూ ఎదిగిపోతున్నాడు. దీనికి తోడు ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోవడంతో బీజేపీ ఎన్నికల్లో సునాయసంగా విజయం సాధిస్తోంది. ఈ సారి మోదీకి ఆ చాన్స్ ఇవొద్దని ప్రతిపక్షాలు తలపోస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని నిలువరించాలని గట్టి ప్లాన్ వేసుకున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందుగానే దాన్ని అమల్లోకి పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వరస భేటీలతో రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. ఇందులో భాగంగా బిజెపికి వ్యతిరేకంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి.. అయితే ఇప్పుడు ఇది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలగజేస్తున్నాయి.
బీజేపీని ఎలా ఓడించాలి?
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎలా ఓడించాలన్న అంశంపైనే ప్రధానంగా ప్రతిపక్షాలు దృష్టి సారించాయి. ఈ నెల 23న పట్నాలో జరిగే సమావేశంలో ఇదే విషయాఆన్ని చర్చించనున్నాయి. ప్రధానంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో 450 చోట్ల బీజేపీతో కాంగ్రెస్, ప్రాంతీయ పార్టీలు ముఖాముఖి తలపడే అవకాశం ఉందని.. బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోకుండా.. ఇక్కడ విపక్షాల నుంచి ఒక్క అభ్యర్థిని మాత్రమే బరిలోకి దించే అంశంపై ఏకాభిప్రాయం సాధించాలని ఐక్యతాయత్నాల బాధ్యత తీసుకున్న బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్‌కుమార్ భావిస్తున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ 2021లో మొదటిసారి ఈ ప్రతిపాదన చేశారు.
సానుకూలంగా స్పందించలేదు
అప్పట్లో ఏ పార్టీ సానుకూలంగా స్పందించలేదు. బీజేపీతో తెగదెంపులు చేసుకుని విపక్షాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు నడుంబిగించిన నీతీశ్ కూడా ఈ ఆలోచననే ముందుకు తీసుకొచ్చారు. అయితే కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు దీనిని ఎంతవరకు అంగీకరిస్తాయన్నది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే బిహార్ తప్ప హిందీ బెల్టులో బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్సే. ఢిల్లీ, పంజాబ్‌లలో పాలక ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి కాంగ్రెస్ మద్దతిస్తుందా అనేది అనుమానమే. అలాగే బెంగాల్లో పాలక తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు బీజేపీతో పాటు కాంగ్రెస్, వామపక్షాలు కూడా ప్రధాన ప్రత్యర్థులే. బీజేపీని ఓడించేందుకు ఈ రెండింటితో సీట్ల సర్దుబాటు చేసుకోవడం అసాధ్యమని టీఎంసీ వర్గాలే అంటున్నాయి.
తెరచాటు మంతనాలు
ఇలా పరస్పర వైరుధ్యాలు ఉన్నప్పటికీ.. ‘ఒకే అభ్యర్థి’ ప్రతిపాదనపై నీతీశ్ ఇప్పటికే ఆయా పార్టీలతో తెరచాటు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. పట్నా భేటీలో దీనికో రూపం రావచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ కూడా హాజరవుతారని తెలుస్తోంది. నిజానికి ఈ సమావేశం ఈ నెల 12న జరగాల్సి ఉంది. రాహుల్ అమెరికా పర్యటనలో ఉండడం.. తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ ఆ రోజు రాలేనని చెప్పడంతో అనివార్యంగా వాయిదాపడింది. ఆయా పార్టీల నేతలతో మాట్లాడిన నితీశ్.. చివరకు 23వ తేదీని ఖరారుచేశారు. పట్నాలోనే ఈ సమావేశం ఏర్పాటుకు ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1975లో అత్యవసర పరిస్థితిని విధించాక.. కాంగ్రెస్ ను ఓడించడానికి విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చే యత్నాలను లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పట్నాలోనే ప్రారంభించారు. అయితే నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న విపక్షాల ఐక్యతా యత్నాల్లో పాలుపంచుకుంటుండడం విశేషం.