Budget Expectations: జాతీయ పింఛన్ వ్యవస్థ(ఎన్‌పీఎస్)ను ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో మరింత ఆకర్షణీయంగా మార్చే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎన్‌పీఎస్‌లో జమ, ఉపసంహరణలపై పన్ను మినహాయింపు పరిధి పెంచడంతోపాటు పలు చర్యలు తీసుకుంటుందని సమాచారం. 75 ఏళ్లు పైబడిన ఎన్‌పీఎస్ చందాదారులకు మరిన్ని ప్రయోజనాలు అందించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈమేరకు ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
పన్ను ప్రయోజనాలు..
ఉద్యోగుల భవిష్య నిధితో సమానంగా ఎన్‌పీఎస్‌లోనూ పన్ను ప్రయోజనాలు కల్పించాలని ఇప్పటికే కేంద్రాన్ని పింఛన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎస్‌ఆర్డీఏ కోరింది. ఈ నేపథ్యంలో దీనిపై బడ్జెట్‌లో స్పష్టత వస్తుందని ఆశిస్తున్నారు. ప్రస్తుతం యాజమాన్యాలు తమ ఉద్యోగుల ఎన్‌పీఎస్‌కు తమ వాటాగా చెల్లించే మొత్తంలో 10 శాతంపై పన్ను మినహాయింపు అమలవుతోంది. దీనిని వచ్చే బడ్జెట్‌లో 12 శాతానికి పెంచే అవకాశం ఉంది.
పొదుపునకు ప్రోత్సాహం..
ఇదే సమయంలో ఎన్‌పీఎస్‌లో దీర్ఘకాల పొదుపును ప్రోత్సహించేలా 75 ఏళ్లు పైబడిన చందాదారులపై పన్ను భారం తగ్గింంచాలని డెలాయిట్ తమ బడ్జెట్ డిమాండ్లలో పేర్కొంది. వార్షిక వాటాపై పన్ను పూర్తిగా తొలగించాలని కోరింది. అలాగే వీరికి ఎన్‌పీఎస్ ద్వారా వచ్చే ఆదాయానికి ఐటీ మినహాయించాలని విన్నవించింది. ప్రస్తుతం పాత ఆదాయ పన్ను విధానం ప్రకారం ఎన్‌పీఎస్‌లో జమ చేసే మొత్తంలో రూ.50 వేల వరకూ పన్ను రాయితీ లభిస్తుంది. ఈ వెసులుబాటును కొత్త పన్ను విధానానికీ వర్తింపజేయాలని పన్ను చెల్లింపుదారులు డిమాండ్ చేస్తున్నారు.
కమిటీ ఏర్పాటు..
ఇక ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వస్తే.. ఎన్‌పీఎస్ మార్పులపై సిఫారసుల కోసం ప్రభుత్వం ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేసింది. ఆర్థిక కార్యదర్శి టీవీ.సోమనాథన్ నేతృత్వంలో ఏర్పడిన ఈ కమిటీ నివేదిక సమర్పిస్తుంది. ఉద్యోగులకు మరిన్ని పింఛన్ ప్రయోజనాలు అందించేలా ప్రస్తుత ఎన్‌పీఎస్‌లో ఎలాంటి మార్పులు చేయాలో ఈ కమిటీ సూచనలు ఇస్తుంది.