Budget 2024: మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు.. సాధారణంగా ఈ సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ చాలా వరకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే రూపొందిస్తారు. అయితే ఓటు ఊరిస్తున్నప్పటికీ.. సంస్కరణలవైపే బిజెపి తన రూటు మళ్లించింది.. అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించామనే ధైర్యమో.. ఇండియా కూటమి విచ్ఛిన్నమవుతుందనే భరోసానో, జ్ఞానవాపి విషయంలోనూ విజయం సాధిస్తామనే ఆత్మవిశ్వాసమో, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామనే సానుకూల దృక్పథమో తెలియదు కానీ.. గురువారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏమాత్రం ఎన్నికల కోణం కనిపించలేదు. దీర్ఘ దృష్టి, ఆధునిక భారత్ నిర్మాణం, ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదగాలనే సంకల్పం మాత్రమే ఆవిష్కృతమయ్యాయి.. ముఖ్యంగా ఈ బడ్జెట్లో ఆర్థిక శాఖ మంత్రి 5 ప్రధాన అంశాలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్న నేపథ్యంలో ద్రవ్య లోటును తగ్గించడం, దేశ ఆర్థిక రంగానికి ఊతమిచ్చే మౌలిక వసతుల కల్పనలో 11% పెట్టుబడులు పెట్టటం, పన్నుల్లో పెద్దగా తేడాలు కల్పించకపోవడం, మాల్దీవుల ఉదంతం తర్వాత పర్యాటకానికి పెద్దపీట వేయడం, రాష్ట్రాలను కలుపుతూ వికసిత్ భారత్ కోసం కృషి చేయడం.. ఈ ఐదు అంశాల చుట్టే నిర్మల బడ్జెట్ ప్రసంగం కొనసాగింది.
ద్రవ్య లోటును తగ్గించడం..
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. ధరల స్థాయి నిరంతరం పెరుగుతోంది. ప్రభుత్వం ఎన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ అది ఇబ్బంది పెడుతూనే ఉంది. ఈ క్రమంలో ధరలను తగ్గించి.. ద్రవ్య లోటును కట్టడి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో ద్రవ్య లోటు 6% ఉండేది. దానిని 5.8% తగ్గించామని.. వచ్చే రోజుల్లో 5.1 శాతానికి తగ్గిస్తామని పార్లమెంట్లో మంత్రి నిర్మల వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొన్నప్పటికీ ద్రవ్య లోటును తగ్గిస్తామని ఆమె ప్రకటించారు..
ప్రైవేటు పెట్టుబడులకు ఆహ్వానం
ఇక మూలధనాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో 10.1 లక్షల కోట్లు ఖర్చు చేయాలని కేంద్రం భావిస్తోంది. దీనిని మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా మూలధనాన్ని ఖర్చు చేయడం వల్ల దేశవ్యాప్తంగా రోడ్ల నిర్మాణం పెరిగింది. రైళ్ల నెట్వర్క్ కూడా పెరిగింది. ప్రధానమంత్రి గతి శక్తి పథకం ద్వారా హైవేలు నిర్మించింది. అయితే ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఉద్యోగాల కల్పన చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా ప్రైవేట్ పెట్టుబడులు పెరిగితే ఈ రంగం మీద చేసే ఖర్చు తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.. ప్రవేటు పెట్టుబడులను ప్రోత్సహించి మౌలిక వసతుల రంగాల్లో వినూత్న మార్పులు తీసుకురావాలని కేంద్ర భావిస్తోంది. గతంలో అమెరికా ఇదే విధానాన్ని అనుసరించి ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్థిక శక్తిగా ఎదిగిందని కేంద్రం గుర్తు చేస్తోంది..
వరాలేవీ లేవు
ఇక గత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూలు కేంద్రం అనుకున్న లక్ష్యాలను అధిగమించింది. దీంతో ఈసారి పన్ను విధానంలో కేంద్రం ఎటువంటి మార్పులు తీసుకురాలేదు. అల్ప ఆదాయ వర్గాలపై కూడా ఎలాంటి వరాలు ప్రకటించలేదు. పైగా పన్నుల వసూలు మరింత మెరుగుపడాలని ఈసారి పెద్ద లక్ష్యాన్ని ముందు పెట్టుకుంది. పన్నులు వసూలయితేనే దేశం అన్ని రంగాల్లో ముందంజ వేస్తుందని కేంద్రం భావిస్తోంది.. వాస్తవానికి ఈసారి పన్ను స్లాబ్ రేట్లలో మార్పులు ఉంటాయని అందరూ భావించారు. ఐదు లక్షల వార్షిక వేతనం పొందే వారికి కొంతమేర వెసలబాటు లభించే అవకాశం ఉంటుందని ఆశించారు. అలాంటి వరాలను కేంద్రం ప్రకటించలేదు.
ఆధ్యాత్మిక పర్యాటకానికి పచ్చ జెండా
ఇక ఇటీవల మాల్దీవుల పర్యటకానికి సంబంధించి దేశ ప్రజలు ఒకే తాటిపై నిలవడంతో ఒక్కసారిగా లక్షద్వీప్ వార్తల్లోకి ఎక్కింది. ఆ ప్రాంతాన్ని రోజు వేలాదిమంది సందర్శించడానికి వెళ్తుండడం కేంద్రాన్ని ఆలోచింపజేసింది. ఇదే సమయంలో ఇటీవల ప్రాణ ప్రతిష్ట చేసుకున్న అయోధ్య రామాలయాన్ని కూడా రోజు లక్షలాది మంది దర్శించుకుంటున్నారు. సాధారణంగా ఇలాంటి రంగాల్లో ఆదాయం పైకి పెద్దగా కనబడదు. లోతుగా లెక్కలు తీస్తే అది చాలా ఉంటుంది. సరిగ్గా ఇదే విషయాన్ని గమనించిన కేంద్రం ఈసారి బడ్జెట్లో పర్యాటకానికి పెద్ద పీట వేసింది.. మరీ ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి పచ్చ జెండా ఊపింది. గతంలో ప్రసాద్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి దేశవ్యాప్తంగా దర్శనీయ ప్రదేశాలను అభివృద్ధి చేశామని చెప్పిన కేంద్రం.. ఈసారి కూడా వాటికి కేటాయింపులు పెంచి ఆధ్యాత్మిక పర్యాటకాన్ని మరింత పెరిగేలా చేస్తామని వివరించింది. ఈ ఆధ్యాత్మిక పర్యాటకం ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తుందని.. కొత్త ఉద్యోగాల సృష్టి కూడా జరుగుతుందని కేంద్రం ప్రకటించింది.
రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ
29 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాల సమ్మేళితమైన దేశంలో.. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలను కలిపే మార్గాలు లేవు. అయితే అన్ని రాష్ట్రాలు కలిస్తేనే వికసిత్ భారత్ అవుతుందని కేంద్రం ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాలను కలిపే విధంగా రోడ్ల నిర్మాణం, రైల్వే నెట్వర్క్, విమానయానం వంటి వాటిల్లో భారీగా పెట్టుబడులు పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఈ రంగాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా కొత్త ఉద్యోగాలు కల్పించడంతోపాటు, నూతన భారత్ ను ఆవిష్కరించేందుకు అవకాశం కలుగుతుందని బడ్జెట్ ప్రసంగంలో నిర్మల వ్యాఖ్యానించారు. మొత్తానికి ద్రవ్యలోటును తగ్గించడం, మౌలిక వస్తువుల కల్పనలో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం, పన్ను వెసులుబాటులో తేడాలు చూపించకపోవడం, పర్యాటకానికి పెద్ద పీట వేయడం, రాష్ట్రాలను కలుపుతూ రోడ్డు, రైలు, విమానయాన రంగాలలో పెట్టుబడులు పెట్టడం.. వంటి అయిదు అంశాలతో తమ లక్ష్యం ఏమిటో బిజెపి చెప్పకనే చెప్పింది.