Bhokar APMC Election Results: “మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితిలో ఇతర పార్టీల నాయకులు వెల్లువలా వచ్చి చేరుతున్నారు. వారిని చూసి దేశం మొత్తం ఆశ్చర్యపోతోంది. అక్కడి రాష్ట్ర ప్రజలు కచ్చితంగా భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారు. తెలంగాణ మోడల్ ఇక్కడ కూడా అమలు చేస్తాం” ఇవీ అప్పట్లో నాందేడ్లో నిర్వహించిన సభలో తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. అప్పట్లో ఈయన చేసిన వ్యాఖ్యల పట్ల పలు పార్టీల నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భారత రాష్ట్ర సమితి వేస్తున్న అడుగులను ఆసక్తిగా గమనించారు. కాని తర్వాత ఏం జరిగింది? భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి బొక్కా బోర్లా పడ్డది. ఓటుకు పదివేల రూపాయలు ఇచ్చినా గెలవలేకపోయింది.. తెలంగాణ ఫార్ములా అంటూ పదేపదే ప్రచారం చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.
ఖాతా తెరవలేకపోయారు
రాష్ట్రానికి భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భవించిన తర్వాత కర్ణాటక ఎన్నికల్లో పోటీ చేస్తామని అప్పట్లో కెసిఆర్ ప్రకటించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ ఆ ప్రయత్నాన్ని ఆయన విరమించుకున్నారు.. తర్వాత మహారాష్ట్ర మీద ఫోకస్ చేశారు.. వాస్తవానికి ఇప్పుడు కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల జరుగుతున్నాయి. ఒకవేళ కేసీఆర్ చెప్పినట్టు భారత రాష్ట్ర సమితి ప్రత్యామ్నాయం అని కేసీఆర్ చూపాలి అనుకున్నప్పుడు.. కచ్చితంగా కర్ణాటక రాష్ట్రంలో పోటీ చేయాల్సి ఉండేది.. కానీ అక్కడ అనూహ్యంగా కెసిఆర్ యూ టర్న్ తీసుకున్నారు.. అయితే మహారాష్ట్రలో పాదం మోపారు.. ఆ రాష్ట్రంలో వరసగా మూడు ప్రాంతాల్లో ప్రచార సభలు నిర్వహించారు. స్థానిక మీడియాకు ఓట్లకు కోట్లు ప్రకటనల రూపంలో చెల్లించారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. తెలంగాణ ఫార్ములా అంటూ ప్రచారం చేసినప్పటికీ, ఒక్కో ఓటర్ కు పదివేల రూపాయల చొప్పున పంపిణీ చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.. భారత రాష్ట్ర సమితి నాయకులు అనేక నజరానాలను ప్రకటించినప్పటికీ భోకర్ మార్కెట్ కమిటీలో ఓటర్లైన రైతులు, పంచాయతీ ప్రతినిధులు, వ్యాపారులు, లేబర్ యూనియన్ ప్రతినిధులు కూడా ఆదరించలేదు.
విస్తరణ పై నీళ్ళు
కొద్దిరోజులుగా భారత రాష్ట్రసమితిని మహారాష్ట్ర విస్తరించాలని కెసిఆర్ కలలు కంటున్నారు. ఇందులో భాగంగానే కోసగా మూడు ప్రాంతాల్లో భారీ సమావేశాలు నిర్వహించారు. ఇదే క్రమంలో భోకర్ మార్కెట్ కమిటీలో నిర్వహించిన ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థులను పోటీలోకి పెట్టారు. కానీ చివరికి ఓటమి పాలయ్యారు. అయితే ఈ మార్కెట్ కమిటీ లో ఉన్న 18 డైరెక్టర్ పోస్టుల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు పూర్తి ఆధిక్యాన్ని ప్రదర్శించారు. ఇక ఆ పార్టీకి సమీప ప్రత్యర్థులుగా భారతీయ జనతా పార్టీ నాయకులు నిలిచారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 డైరెక్టర్ పోస్టులను, ఆ పార్టీకి మిత్రపక్షంగా బరిలోకి దిగిన ఎన్సిపి రెండు, బిజెపి మూడు డైరెక్టర్ స్థానాలు గెలిచింది. అయితే ఈ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కీలక నేత, ఎమ్మెల్యే అభ్యర్థి నాగనాథ్ కూడా స్వయంగా ఓటమిపాలయ్యారు. ఓటుకు బిజెపి, కాంగ్రెస్ 5000 చొప్పున పంచగా, భారత రాష్ట్ర 10,000 ఇచ్చింది.. ఇక్కడ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నాగనాథ్ కు ఏకంగా కెసిఆర్ సూచనలు ఇచ్చారు. దానికి ఉపయోగం లేకుండా పోయింది. సంవత్సరానికి మార్కెట్ కమిటీలో 18 డైరెక్టర్ పోస్టులకు 11 డైరెక్టర్ పోస్టులకు రైతు సహకార సంఘాల ప్రతినిధులు ఓట్లు వేస్తారు. పోస్టులకు గ్రామపంచాయతీ ప్రతినిధులు, రెండింటికి వ్యాపార సంఘాల ప్రతినిధులు, ఒక పోస్ట్ కు హమాలి యూనియన్ ప్రతినిధులు ఓటు వేస్తారు. ఈ నాలుగు విభాగాల్లో భారత రాష్ట్ర సమితికి కనీస ఆదరణ లభించలేదు. “ఆబ్ కీ బార్ కిసాన్ సర్కార్” నినాదంతో మహారాష్ట్రలో వరుస సమావేశాలు నిర్వహించినప్పటికీ.. రైతు సహకార సంఘాల తరఫున ఒక డైరెక్టరేట్ స్థానానికి పోటీ చేసిన నాగనాథ్ ఓటమి పాలు కావడం విశేషం.. భారత రాష్ట్ర సమితి బలపరిచిన అభ్యర్థుల్లో నాగ నాథ్ కు మాత్రమే అత్యధికంగా ఓట్లు వచ్చాయి. లేబర్ యూనియన్ డైరెక్టర్ పోస్టులో మాత్రం రాష్ట్ర సమితి బిజెపి కంటే ఆరు ఓట్లు ఎక్కువ సాధించడం ఎక్కడ విశేషం.
అడ్డుకున్న అశోక్ చవాన్
మహారాష్ట్రలో భారత రాష్ట్ర సమితి విస్తరణను రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆదిలోనే అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పకడ్బందీగా చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే భారత రాష్ట్ర సమితి నోట్ల పంపిణీకి అడ్డుకట్ట వేసేందుకు బలమైన ప్రత్యర్థులను బరి లోకి దించారు. ఈ ఎన్నికల్లో గెలిచి కెసిఆర్ వద్ద మైలేజీ సంపాదించాలనే నాగ నాథ్ కోరికను కూడా ఆయన ఆదిలోనే తుంచేశారు.