BJP Vijaya Sankalpa Sabha: దేశ ప్రధాని దామెదరదాస్ నరేంద్ర మోదీ తెలంగాణలో రెండ్రోజులు పర్యటన చేయనున్నారు. ఈమేరకు నరేంద్ర మోదీ నిన్ననే బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోగా బీజేపీ నాయకులు, శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ప్రధాని పర్యటనతో తెలంగాణలో బీజేపీలో కొత్త జోష్ నెలకొంటుందని తెలంగాణ నేతలు భావిస్తున్నాయి. అయితే మోదీ పర్యటన తెలంగాణలో రోటిన్ కు భిన్నంగా కొనసాగుతుండటం కొంత ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సాధారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పబ్లిక్ ఉండే ప్రాంతాలకు వెళ్లినప్పుడు రోడ్డు మార్గంలో వెళ్లడానికే ఆసక్తి చూపిస్తుంటారు. తాను రోడ్డు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటే ఆ రోడ్డుకు ఇరువైపులా భారీగా జనాలు వేచి ఉండి, కేరింతలు కొడుతుంటే ఉంటే వారికి అభివాదం చేస్తూ ముందుకెళ్లడం ఆయనకు పరిపాటి. కానీ ఈసారి మోదీ పర్యటనలో ఈ కిక్కు లేకుండా పోతుందని అర్థమవుతోంది. ఎందుకంటే ప్రధాని పర్యటన తెలంగాణలో ఎక్కువ శాతం వాయు మార్గంలోనే కొనసాగుతోంది.
తెలంగాణలో ప్రధాని మోదీ రెండ్రోజులు పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్డుకు ప్రధాని మోదీ నిన్ననే చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా హైటెక్స్ సిటీలో జరగబోయే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశానికి హెలికాప్టర్ లో చేరుకున్నారు. అయితే ప్రధాని మోదీ ఈసారి రోడ్డు మార్గం కంటే కూడా వాయు మార్గంలోనే ఈసారి తన పర్యటనకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు కన్పిస్తోంది.
కావేరీ జలాల వివాదం జరుగుతున్న సమయంలోనే ప్రధాని మోదీ చెన్నైలో పర్యటించారు. గతంలో మాదిరిగానే మోదీ విమానం దిగాక రోడ్డు మార్గంలో జనానికి అభివాదం చేస్తూ వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే మోదీకి చెన్నైలో ఎన్నడూ లేనంతగా నిరసనలు ఎదురయ్యాయి. నల్లచొక్కాలు, నల్ల ప్లకార్డులతో రోడ్డుకు ఇరువైపులా ప్రజలు నిలబడ్డారు. ఈ నిరసన మధ్య వెళ్లేందుకు వెనుకంజ వేసిన మోదీ అప్పటికప్పుడు రోడ్డు మార్గంలో కాకుండా వాయుమార్గంలో కార్యక్రమం వేదిక వద్దకు వెళ్లారు. అయినప్పటికీ తమిళులు నల్ల బెలున్లకు గాల్లోకి ఎగరవేసి మోదీకి తమ నిరసనను తెలియజేశారు.
ఈరోజు సాయంత్రం పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బీజేపీ విజయ సంకల్ప బహిరంగ సభకోసం జరుగనుంది. ఈ సభకు కోసం ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయం దాకా హెలికాప్టర్ లోనే వెళ్లనున్నారు. ఇక్కడి నుంచి పెరేడ్ గ్రౌండ్స్ వరకు మాత్రమే రోడ్డు మార్గంలో వెళ్లనున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య ప్లెక్సీ వార్, మాటలయుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన ఉత్కంఠగా మారింది.
మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, కాంగ్రెస్ నిరసన కార్యక్రమాలకు ప్లాన్ చేశాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ సైతం టీఆర్ఎస్, కాంగ్రెస్ కు ధీటుగా జవాబిస్తోంది. దీంతో ప్రధాని మోదీ నేటి బీజేపీ విజయ సంకల్ప సభలో ఎలాంటి ప్రసంగం చేస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.