BJP chiefs : తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ సారధులు మారనున్నారా? అసలు హైకమాండ్ ఉద్దేశ్యమేమిటి? నిజంగా మారుస్తారా? లేకుంటే ప్రచారమా? ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఇదే చర్చనీయాంశంగా మారింది. కేంద్ర కేబినెట్ లో భారీ ప్రక్షాళనతో పాటు కీలక రాష్ట్రాల్లో నాయకత్వాల మార్పుపై బీజేపీ మేథోమధనం చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై మోదీ ఆధ్వర్యంలో బీజేపీ కీలక నేతలు చర్చలు జరిపినట్టు ప్రచారం జరుగుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై ప్రకటన సైతం వస్తుందని టాక్ నడుస్తోంది. అయితే అది ఎంతవరకూ వాస్తవం అన్నది తెలియాల్సి ఉంది. కానీ గత మూడు రోజులుగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం పనిగట్టుకొని ప్రచారం చేయడం విశేషం.
ఈ ఏడాది చివర్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన పదవీకాలం సైతం పూర్తయ్యింది. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డికి రాష్ట్ర బీజేపీ పగ్గాలు ఇచ్చి.. బండి సంజయ్ ను కేబినెట్ లో తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. అయితే అది ఎంతవరకూ నిజమన్నది తెలియడం లేదు. బండి సంజయ్ మున్నూరు కాపు వర్గానికి చెందిన వారు. ఇప్పటికే కాంగ్రెస్ అధ్యక్ష పదవి రెడ్లకు ఇచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు అదే సామాజికవర్గానికి చెందిన కిషన్ రెడ్డికి బీజేపీ పగ్గాలు ఎలా అని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బండి సంజయ్ ను మార్చాలంటే అదే వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలే తప్ప మరొకరికి చాన్స్ లేదని తెలుస్తోంది.
ఏపీలో సైతం సోము వీర్రాజుకు పక్కకు తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. ఆంధ్రజ్యోతిలో ఏకంగా కథనమే వచ్చింది. ఆయన స్థానంలో కమ్మ సామాజికవర్గానికి చెందిన సత్యకుమార్ ను తీసుకుంటారని కథనం సారాంశం. బీజేపీ ఒక స్ట్రాటజీతో ముందుకు సాగుతోంది. దశాబ్దాలుగా రాజ్యాధికారం కోసం చూస్తున్న కాపులకు పెద్దపీట వేయాలన్నది వ్యూహం. అందులో భాగంగా కన్నా లక్ష్మీనారాయణకు, తరువాత సోము వీర్రాజుకు ఇచ్చారు. ఇప్పుడు సోము వీర్రాజును తప్పిస్తే అదే సామాజికవర్గం నేతతో భర్తీ చేస్తారు తప్ప సత్యకుమార్ కు చాన్స్ లేదన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే కమ్మ సామాజికవర్గాన్ని టీడీపీ ఓన్ చేసుకున్నందున … అదే సామాజికవర్గానికి చెందిన సత్యకుమార్ కు ఎలా అప్పగిస్తారన్నది పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మరోవైపు ఏపీ విషయంలో బీజేపీ హైకమాండ్ పెద్దగా ఆలోచన చేయలేదని తెలుస్తోంది. ఏదైనా చేయాలంటే తెలంగాణ వరకే కానీ.. ఏపీలో మాత్రం ప్రయోగాలు చేసే చాన్సే లేదని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీ విషయంలో హైకమాండ్ కు రెండే ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి పొత్తులపై వెళ్లి పార్టీని బలోపేతం చేసుకోవడం, రెండూ ఒంటరిగా వెళ్లి భవిష్యత్ కు పునాది వేసుకోవడం. అంతుకు మించి ఎటువంటి ప్రయోగాలకు బీజేపీ ముందుకెళ్లే చాన్సేలేదని తెలుస్తోంది. కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మాత్రం మార్పులు అనివార్యమని ప్రచారం చేస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?