Rahul Gandhi: బీహార్ రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అయితే ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఓటు చోరీ అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి హైప్ ఏర్పడింది. వాస్తవానికి రాహుల్ గాంధీ కూడా దీనిని అంచనా వేయలేదు. ఆ తర్వాత బీహార్ ఎన్నికల్లో ముఖ్యంగా ప్రచారం సమయంలో రాహుల్ గాంధీ ఓటు చోరీ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రాహుల్ గాంధీ ఊహించినట్టుగానే జనం కూడా భారీగానే వచ్చారు. అన్నిటికంటే ముఖ్యంగా బీహార్ రాష్ట్రంలో నితీష్ ప్రభుత్వాన్ని కంటే ముందుగానే రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు.
ఓటు చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ జనాలలోకి తీసుకుపోవడానికి ప్రయత్నించారు. కొంతమేర విజయవంతమయ్యారు. అయితే ఆయన ప్రస్తావించిన అంశాలను కేవలం ఆరోపణల విధంగా కాకుండా.. అఫిడవిట్ రూపంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. పైగా ఆయన ఓట్ చోరి అంశాన్ని ప్రస్తావిస్తూనే.. ఇతర సమస్యలను కూడా తెరపైకి తీసుకువచ్చి ఉంటే బాగుండేది. ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలోను రాహుల్ గాంధీ కేవలం ఓటు చోరీ అంశానికి మాత్రమే పరిమితమయ్యారు.. పైగా ఆయన ఆధారాలను ఎన్నికల సంఘానికి కాకుండా.. కేవలం ఎన్నికల స్టంట్ లాగా మార్చారు. దీనికి తోడు బీహార్ లో సీరియస్ గా ఎన్నికలు జరుగుతుంటే ఆయన కొలంబియాలో పర్యటనకు వెళ్లారు. ఆ పర్యటన విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచారు. ఈ విషయం మహాగట్ బంధన్ లో ఉన్న పార్టీలకు తెలియకపోవడం విశేషం.. దీనికి తోడు కొలంబియా ప్రాంతంలో కూడా మన దేశ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడారు. ఎన్నికల సంఘం తీరును తీవ్రంగా తప్పు పట్టారు.
వాస్తవానికి ఎన్నికల ప్రచారంలో ఒకటే అంశానికి పరిమితం కాకూడదు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావాలి. అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పగలగాలి. ఓటు చోరీ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూనే.. ఇతర సమస్యలను కూడా వెలుగులోకి తీసుకొచ్చి ఉంటే కాంగ్రెస్ పార్టీకి కాస్తలో కాస్త బలం ఉండేది.మహా ఘట్ బంధన్ కు మరింత పరపతి పెరిగేది. దీనికి తోడు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ ప్రధానంగా కనిపించారు. ముఖ్యంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు హడావిడి చేశారు. టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ నాయకులు అవకతవకలకు పాల్పడ్డారు. దీంతో బీహార్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిని అక్కడి కార్యకర్తలు కొట్టారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హడావిడి వల్ల ఆర్జెడి నేతలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒకానొక దశలో తేజస్వి యాదవ్ కూడా పరోక్షంగా ఆరోపణలు చేశారు.. ఇవన్నీ కూడా ఓటర్ల ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. దీంతో మహా ఘట్ బంధన్ కు బలం తగ్గిపోయింది. సీట్ల కేటాయింపు విషయంలో కూడా ఆర్జెడి, కాంగ్రెస్ నాయకుల మధ్య ఐకమత్యం లోపించింది. దీంతో 12 స్థానాలలో స్నేహపూర్వకంగా పోటీ చేయాల్సి వచ్చింది. ఇది కూడా ఎన్డీఏ కూటమికి బలమైన ఎన్నికల అస్త్రంగా మారింది. దీనికి తోడు రాహుల్ గాంధీ క్షేత్రస్థాయిలో పూర్తి కాలం ఉండలేకపోయారు. ఎన్నికల ప్రచారాన్ని ఏదో పొలిటికల్ స్టంట్ లాగా మార్చారు. మరోవైపు ఆర్ జె డి కూడా ఎన్డీఏ కూటమి తప్పులను బయటకు చెప్పలేకపోయింది. సీట్ల కేటాయింపు దగ్గర తీవ్రమైన తర్జనభర్జన పడింది. మరోవైపు ఎన్డీఏ కూటమి అత్యంత వేగంగా సీట్ల కేటాయింపు జరిపింది.. అవగాహనతో పోటీ చేసింది. ఎన్డీఏ కూటమిలో పదిమంది మంత్రులు విజయం దిశగా ఉన్నారంటే.. అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సార్వత్రిక ఎన్నికల్లో బిజెపికి చుక్కలు చూపించిన కాంగ్రెస్.. ఆ తర్వాత అదే జోరును మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో చూపించలేకపోయింది. చివరికి బీహార్ రాష్ట్రంలో వచ్చిన హైప్ ను కాపాడుకోలేకపోయింది.