Corona Third Wave: దేశమంతా ఒమిక్రాన్ భయాందోళనలతో కేసులు పెరిగి కఠిన నిబంధనలు పెడుతుంటే తెలంగాణ సర్కార్ మాత్రం న్యూఇయర్ వేళ ఏకంగా అర్థరాత్రి 1 గంట వరకూ కూడా మద్యం అమ్మకాలు చేసి వేడుకలను ప్రోత్సహించిందన్న అపవాదును మూటగట్టుకుంది. ఆ నిర్లక్ష్యం ఇప్పుడు తెలంగాణ పాలిట శాపమైందా? అంటే ఔననే సమాధానం వస్తోంది.
క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలకు జనాలకు రిలాక్స్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా మూల్యం చెల్లించుకుంది. డిసెంబర్ మూడో వారం వరకు తెలంగాణలో రోజుకు సగటున 100లోపు కేసులు నమోదు కాగా, నాలుగో వారంలో క్రిస్మస్ వేడుకలు, డిసెంబర్ 31 తర్వాత వైరస్ మరింత వేగంగా విస్తరించింది. తెలంగాణ వ్యాప్తంగా మంగళవారం 1000కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వీటిలో అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో పాజిటివ్ కేసులు పెరగడం గమనార్హం.
ఇప్పటికే దేశంలోని ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీలు దాదాపు కర్ఫ్యూ, లాక్ డౌన్ నిబంధనలు పెట్టాయి. అక్కడ థర్డ్ వేవ్ మొదలైందనే చెబుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఒక్కసారిగా 1000 కరోనా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
గత వారం క్రితమే తెలంగాణ హెల్త్ డైరెక్టర్ థర్డ్ వేవ్ వస్తుందని.. ప్రజలంతా రానున్న రెండు వారాలు చాలా జాగ్రత్తగా ఉండాలని.. భౌతిక దూరం, మాస్క్ లు ధరించాలని హెచ్చరించారు. ఆయన చెప్పినట్టే తెలంగాణలో కేసులు భారీగా పెరిగాయి. న్యూఇయర్, క్రిస్మస్ వేడుకలతో కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే ఏకంగా 1000కు పైగా కేసులు నమోదయ్యాయి. చూస్తుంటే థర్డ్ వేవ్ తెలంగాణలో వచ్చినట్టే కనిపిస్తోంది.
తెలంగాణలో సోమవారం 482 కేసులు నమోదు కాగా.. ఒక్కరోజు వ్యవధిలోనే రెట్టింపు అయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 6,84,023కు పెరిగింది. రెండు మరణాలు సంభవించాయి. ఇప్పటివరకూ తెలంగాణలో 4033 మంది కరోనాతో చనిపోయారు.
ఇప్పుడు థర్డ్ వేవ్ ఒమిక్రాన్ పోయిన సెకండ్ వేవ్ కంటే వేగంగా వ్యాపిస్తోందని తేలింది. సో తెలంగాణలో కేసుల తీవ్రత చూస్తే ఖచ్చితంగా థర్డ్ వేవ్ వస్తుందన్న భయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే తెలంగాణ గురుకులాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారినపడ్డారు. జిల్లాల్లోనూ వైరస్ తీవ్రత పెరుగుతోంది. దీంతో ఖచ్చితంగా ఈ వ్యాప్తి థర్డ్ వేవ్ కు కారణమవుతోందన్న ఆందోళనలు వెంటాడుతున్నాయి.