Bharat Rice: పెరిగిన ధరలతో ఇన్నాళ్లూ బియ్యం కొనుక్కోవడానికి కూడా పేద, మధ్యతరగతి ప్రజలు జేబులు తడుముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఆ పరిస్థితి ఉండదు. కేంద్రం ఇటీవల ప్రకటించినట్లుగా రూ.29 కిలో బియ్యం మంగళవారం (ఫిబ్రవరి 6) నుంచి అందుబాటులోకి తెస్తోంది. ఇక అందరూ కొనుక్కోవచ్చు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో భారత్ రైస్ అమ్మకాలను ప్రారంభించారు. అయితే ఈరోజే మార్కెట్‌లో దొరక్కపోవచ్చు. కానీ, ఆన్‌లైన్‌లో కొనుక్కోవచ్చు.
ఎఫ్‌సీఐ, ఎన్‌ఏఎఫ్‌ఈడీ ద్వారా అమ్మకాలు..
భారత్ రైస్‌ను కేంద్రం మొదట భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ), భారత జాతీయ వ్యవసాయ సహకార మార్కెటింగ్ సమాఖ్య(ఎన్‌ఏఎఫ్‌ఈడీ), భారతీ జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య(ఎన్‌సీసీఎఫ్) ద్వారా ముందుగా విక్రయించాని నిర్ణయించింది. భారత్ రైస్ ఇప్పుడే కావాలనుకునేవారు https://www.nafedbazaar.com/product-tag/online-shopping వెబ్‌సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చు. ఈ సైట్‌లో లాగిన్ అయి భారత్ రైస్‌తోపాటు పప్పు, పంచదార, శనగలు ఇలా చాలా ఉత్పత్తులను తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.
ఇలా అందుబాటులో..
భారత్ రైస్‌ను కేజీ రూ.29కే కేంద్రం విక్రయిస్తుంది. ఈ రైస్ 5 కేజీలు, 10 కేజీల బ్యాగుల్లో లభిస్తాయి. ఈ రైస్‌తోపాటు గోధుమ పిండిని కిలో రూ.27.50కు, శనగ పప్పు కేజీ రూ.60కి నాఫెడ్‌లో అమ్ముతున్నారు. నాఫెడ్‌తోపాటు ఇతర ఆన్‌లైన్ ఈకామర్స్ సైట్లలో కూడా భారత్‌రైస్ అందుబాటులో ఉంది. నాఫెడ్‌లో కొనుక్కోవాలంటే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆ తర్వాత లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.