Ram Mandir
Ram Mandir: ఆది పురుషుడు శ్రీరాముడు పుట్టిన అయోధ్యలో 500 ఏళ్ల తర్వాత రాముడు కొలువుదీరబోతున్నాడు. అయోధ్యలో నిర్మించిన రామాలయ నిర్మాణం పూర్తి కావొచ్చింది. బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు ముహూర్తం దగ్గర పడుతోంది. జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 సెకన్ల నుంచి 12:30:32 సెకన్ల వరకు అంటే 84 సెకన్ల మధ్య అయోధ్యలో రామ్‌లల్లా ప్రతిష్టాపన జరుగబోతోంది. ఈమేరకు అయోధ్యలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఏడు వేల మంది అతిథులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారు. సెక్యూరిటీ పరంగానూ అయోధ్యలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫైట్, రైళ్ల రిజర్వేషన్లు, హోటళ్ల బుకింగ్‌లు పూర్తయ్యాయి. మరోవైపు అయోధ్యలో ప్రతిష్టాపన పూజలు జనవరి 16న ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పుడు రామాలయ బాలరాముడి ప్రాణ ప్రతిష్ట ముహూర్తంపై వివిధ అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికాలోని వైదిక యూనివర్సిటీకి చెందిన ఓ పండితుడు జనవరి 22న నిర్ణయించిన ముహూర్తంపై రీసెర్చ్ ప్రారంభించారు.
ముహూర్త బలమెంత..
అయోధ్య రామాలయంలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టకు జనవరి 22న అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12:29 నిమిషాలకు ముహూర్తం నిర్ణయించారు. ఇది చాలా అద్భుతమైన ముహూర్తమని పండితులు చెబుతున్నారు. అయితే ఈ ముహూర్త బలంపై అమెరికాలో శాస్త్రవేత్తగా ఉద్యోగం చేస్తూ.. హిందూ ధర్మం ప్రచారం చేస్తున్న డాక్టర్ వెంకట చాగంటి, బ్రిటన్ నుంచి రాఘవేంద్రసాయి రీసెర్చ్ చేస్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ అప్లయిడ్ వేదిక్ సైన్సెస్ ద్వారా ఈ పరిశోధన చేశారు. ఇందులో అయోధ్యకు నిర్వహించిన ముహూర్తంపైనే వారు రీసెర్చ్ చేస్తున్నారు.
ముహూర్తానికి బలం ఉంటుందా..
అయితే సాధారణంగా మనం పుట్టిన గడియల ఆధారంగా ముహూర్తం చూసి దాని ఆధారంగా పుట్టిన శిశువు భవిష్యత్‌ను అంచనా వేస్తారు. ఇక పెళ్లిళ్ల సమయంలో వధూవరులు పుట్టిన గఢియల ఆధారంగానే ముహూర్తం నిర్ణయిస్తారు. అదే విధంగా రామాలయ ప్రాణ ప్రతిష్టకు పెట్టిన ముహూర్తం కూడా బలమైందా కాదా అన్న చర్చకు యూనివర్సిటీ ఆఫ్ అప్లయిడ్ వేదిక్ సైన్సెస్ పరిశోధకులు తెరతీశారు. ఎందుకంటే.. భారత దేశంలో ఇప్పటికి ఉన్న ఆలయాల నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట ఎప్పుడు జరిగింది అని అనేక పరిశోధనలు చేశారు. వాటి మనుగడ, అభివృద్ధి, ఆదరణ అంతా నాటి ముహూర్త బలమే కారణమంటున్నారు పరిశోధకులు. అందుకే రామాలయ ప్రాణప్రతిష్ట ముహూర్తం ఆధారంగా అయోధ్య రామ మందిరం ఎంత ఆదరణ పొందుతుంది. ఎంత భవిష్యత్ ఉంటుంది అని తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు. దీనిపై పరిశోధనలు చేస్తున్నామని, ఫలితాలను వెల్లడిస్తామని వెంకట్ చాగంటి, రాఘవేంద్రసాయి తెలిపారు.