Crime News : మూడుముళ్ల బంధాలు ముక్కలవుతున్నాయి. కలిసి వేసిన ఏడడుగులు చెరిగిపోతున్నాయి. క్షణకాల సుఖం కోసం వందేళ్ల జీవితాలు బుగ్గి అవుతున్నాయి. క్షణికావేశంలో చేసిన తప్పు.. జీవితాంతం జైలు గోడల మధ్య గడిచిపోతోంది. సొంతవారిని దూరం చేస్తోంది. పెద్ద దిక్కులేక బిడ్డల బతుకు ప్రశ్నార్థకమవుతోంది. ఎక్కడ చూసినా ఇదే రోత. అక్రమ సంబంధాల అగ్నిగుండంలో లెక్కలేనన్ని బంధాలు బూడిదవుతున్నాయి.
అక్రమ సంబంధాల కోసం వెంపర్లాడిన ఓ మహిళ జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది. కర్ణాటకలోని కోప్పళ జిల్లా కలకబండి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కలకబండి గ్రామానికి చెందిన ముత్తమ్మ భర్తతో హాయిగా జీవితం గడుపుతోంది. ఆ హాయి గల జీవితం ఆమెకు చేదుగా అనిపించింది. అనిపించిందే తడువుగా అదే గ్రామానికి చెందిన ఈశప్ప అనే వ్యక్తితో అక్రమ సంబంధానికి దారితీసింది. ముత్తమ్మకు భర్త ఉన్నాడు. అదే గ్రామంలో వ్యవసాయం చేస్తున్నాడు. కానీ ముత్తమ్మ కళ్లం లేని కోర్కెలతో అక్రమ సంబంధానికి ఒడిగట్టింది.
ముత్తమ్మ మత్తులో ఈశప్ప కావాల్సినంత డబ్బు వెదజల్లాడు. ముత్తమ్మ తన అవసరాలను తీర్చుకుంది. అటు శారీరకంగా ఇటు ఆర్థికంగా ఈశప్పను బాగా వాడుకుంది. ఇద్దరూ కొన్నాళ్లపాటు అడ్డు ఆపు లేకుండా అక్రమ సంబంధాన్ని కొనసాగించారు. ఇంతలోనే మత్తమ్మకు ఈశప్ప పై మోజు తీరిపోయింది. అందుకే ఇంకో జోడీ కోసం వెతకసాగింది. పొరుగూరికి చెందిన సమీప బంధువైన యువకుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ముత్తమ్మ వ్యవహారం గమనించిన ఈశప్పకు ఆమె పై అనుమానం కలిగింది. మరో యువకుడితో అక్రమ సంబంధం ఉన్నట్టు ఈశప్ప ముత్తమ్మను అనుమానించాడు.
అనుమానంతో రగిలిపోయిన ఈశప్ప ముత్తమ్మను కడతేర్చడానికి పన్నాగం పన్నాడు. పక్కా ప్రణాళికతో ముత్తమ్మను హతమార్చాడు. అనుమానం రాకుండా ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించాడు. కానీ యలబర్గ పోలీసుల దర్యాప్తులో ఈశప్ప ఉదంతం వెలుగులోకి వచ్చింది. ముత్తమ్మను హత్య చేసి .. ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈశప్పను అరెస్టు చేశారు. ఈశప్ప ముత్తమ్మను హత్య చేసినట్టు పోలీసులు కోర్టులో ఆధారాలు సమర్పించారు. నేరం చేసినట్టు రుజువు కావడంతో ఈశప్పకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధించారు.
అక్రమ సంబంధాల మోజులో బంధాలను నిర్వీర్యం చేసుకుంటున్న వారికి ఇలాంటి ఘటనలు ఉదాహరణ కావాలి. క్షణకాల సుఖం కోసం జీవితాలను బలితీసుకునే వారికి కనువిప్పు కలగాలి. జీవితం అంటే క్షణకాల సుఖం కాదు.. వందేళ్ల ప్రయాణం అని అర్థం కావాలి. మూడు ముళ్ల బంధం మూణ్నాళ్ల ముచ్చట కాదని తెలుసుకోవాలి. అప్పుడే ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పడుతుంది.