HomeజాతీయంAtrocities Against Women: సీరియల్‌ రేపిస్ట్‌ను లేపేశారు.. కోర్టు హాల్‌లోనే మట్టుబెట్టిన మహిళలు.. 17 ఏళ్ల...

Atrocities Against Women: సీరియల్‌ రేపిస్ట్‌ను లేపేశారు.. కోర్టు హాల్‌లోనే మట్టుబెట్టిన మహిళలు.. 17 ఏళ్ల క్రితం ఘటన!!

Atrocities Against Women: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతూ చట్టం, న్యాయంలోని లొసుగులను ఆసరాగా చేసుకుని తప్పించుకుంటున్న సీరియల్‌ రేపిస్టును మహిళలే కోర్టు హాల్‌లోనే మట్టుపెట్టారు. సరిగ్గా 17 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన బాధితుల్లో ఆక్రోశం, అతడిపై ఉన్న కసి, మహిళా చైతన్యానికి నిదర్శనంగా నిలిచింది. 70 సార్లు పొడిచి, కారం చల్లి, రాళ్లతో అంతమొందించడం, హతుడి పురుషాంగాన్ని కోసేయడం నిందితుడిపై బాధితులకు ఉన్న కసిని తెలియజేసింది.

Atrocities Against Women
Atrocities Against Women

బెయిల్‌పై తప్పించుకుంటూ..

భరత్‌ కాళీచరణ్‌ ఉరఫ్‌ అక్కు యాదవ్‌.. నాగపూర్‌లో జన్మించిన ఓక్రూర మృగాడు. 20 ఏళ్లకే గ్యాంగ్‌స్టర్‌గా మారాడు. ఆ రోజుల్లో ఇతడి అకృత్యాలకు అంతేలేకుండా పోయింది. దోపిడీలు, కబ్జాలు, కిడ్నాప్‌లు, సీరియల్‌ రేప్‌లు, వరుస హత్యలతో తన అరాచకానికి అడ్డే లేనట్లుగా రెచ్చిపోయాడు. నేరాలు చేసినా జైలుకు వెళ్లడం, తప్పుడు సాక్ష్యాలు, చట్టాలు, న్యాయ వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని విడుదలయ్యేవాడు. లైంగిక దాడి చేసులో జైలుకు వెళ్లిన కాళీచరణ్‌ను పోలీసులు 2004, ఆగస్టు 13న నాగపూర్‌ జిల్లా కోర్టు నెం. 7లో కోర్టు హాలులోని మార్బుల్‌ ఫ్లోర్‌లోకు తీసుకొచ్చారు. మళ్లీ బెయిల్‌పై నిందితుడు బయటకు వస్తాడన్న వార్త వ్యాపించింది. దీంతో బాధిత మహిళలతోపాటు వందలాది మంది కోర్టు వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని గమనించిన పోలీసులు కోర్టు బెయిల్‌ ఇస్తే అందరూ శాంతించే వరకు కస్టడీలో ఉంచి ఆపై విడుదల చేయాలని ప్లాన్‌ చేశారు. అప్పటికే వందలాది మంది మహిళలు మురికివాడల నుంచి కూరగాయల కత్తులు, కారంపొడి పట్టుకుని న్యాయస్థానం వరకు కవాతు నిర్వహించి, న్యాయస్థానంలోకి వెళ్లి ముందు భాగంలో కూర్చున్నారు. ఇంతలో పోలీసులు అక్కుయాదవ్‌ను కోర్టుకు తీసుకువచ్చాడు. చిన్నపాటి పశ్చాత్తాపం లేకుండా లోపలికి నడిచాడు యాదవ్‌. మధ్యాహ్నం 2:30 నుంచి 3:00 గంటల మధ్య, యాదవ్‌ అతను అత్యాచారం చేసిన మహిళను చూశాడు. ఆమెను వెక్కిరిస్తూ, వ్యభిచారి అని, మళ్లీ అత్యాచారం చేస్తానని అరిచాడు. పోలీసులు కూడా యాదవ్‌ మాటలు విని నవ్వి ఊరుకున్నట్లు సమాచారం.

ఆవేశంతో..

అప్పటికే ఆవేశంతో ఊగిపోతున్న మహిళల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వెంటనే ఎదురుగా ఉన్న ఒక మహిళ అతని తలపై చెప్పుతో కొట్టింది. యాదవ్‌ను చంపేస్తానని ఊగిపోయింది. నువ్వో నేనో తేల్చుకుందాం రా అంటూ సవాల్‌ చేసింది. ఈ మాటలు అక్కడే ఉన్న మహిళలను మరింత చైతన్య పర్చాయి. వెంటనే 200 నుంచి 400 మంది మహిళలు గుంపుగా యాదవ్‌పై దాడికి దిగారు.

ఒక్కో మహిళ ఒక్కో కాళీమాతగా..

సీరియల్‌ రేపిస్ట్‌పై కట్టలు తెగిన కోపంతో ఉన్న మహిళలు కాళీమాత ఉగ్రరూపంలా మారిపోయారు. వారి ఆవేశాన్ని చూసిన పోలీసులు భయంతో అక్కడి నుంచి పారిపోయారు. మహిళల దాడి, పోలీసులు పారిపోవడం గమనించిన యాదవ్‌లో వణుకు మొదలైంది. గట్టిగా అరిచాడు. ‘నన్ను క్షమించండి.. నేను మళ్లీ తప్పు చేయను’ అని వేడుకున్నారు. కానీ అప్పటికే స్త్రీలు తమ కత్తులను చుట్టుముట్టారు. ప్రతీ మహిళ కనీసం ఒకసారి పొడవాలన్నంత కసితో ముందుకు కదిలారు. 70 సార్లు పొడిచారు. ముఖంపై రాళ్లతో దాడిచేశారు. కారంపొడి చల్లారు. ఓ బాధితురాలు అతడి పురుషాంగాన్ని కోసిపాడేసింది. కోర్టు హాలులోని అంతస్తులు, గోడలపై అతని రక్తం చిమ్మింది. అతను 32 సంవత్సరాల వయస్సులో ఉన్నాడు.. ఒక దశాబ్దం పాటు సాగిన నేరాలతో విసిగిపోయిన మహిళలు 15 నిమిషాల్లో మట్టుపెట్టారు.

మురికివాడల్లో సంబురాలు..

కసితీరా యాదవ్‌ను చంపిన మహిళలు కస్తూర్బా నగర్‌కు తిరిగి వచ్చి యాదవ్‌ను చంపినట్లు పురుషులకు చెప్పారు. వీధుల్లో సంగీతం మరియు నృత్యంతో మురికివాడల పరిసరాల్లో సంబరాలు అంబరాన్నంటాయి. పోలీసులు అక్కడకు చేరుకుని ఐదుగురు మహిళలను అరెస్టు చేశారు కానీ నగరంలో ప్రదర్శనల తరువాత విడుదల చేశారు. ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి మహిళ హత్యకు బాధ్యత వహించాలని పేర్కొన్నారు.

యాదవ్‌ అకృత్యాలకు అంతేలేదు..

1971లో జన్మించిన యాదవ్‌ కనీసం ముగ్గురు వ్యక్తులను హత్య చేశాడు. అతను ప్రజలను హింసించాడు, కిడ్నాప్‌ చేశాడు, ఇళ్లలోకి చొరబడ్డాడు. 40 మందికి పైగా మహిళలు, బాలికలపై అత్యాచారం చేశాడు. పోలీసులకు లంచం ఇచ్చి, నేరాలను కొనసాగించాడు. చాలా సంవత్సరాలుగా, యాదవ్‌ మరియు అతని సహచరులు తనను ప్రతిఘటించిన వారికి హెచ్చరికగా 10 సంవత్సరాల వయస్సు ఉన్న బాలికలపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యాదవ్‌ కస్తూర్బా నగర్‌లో నివసిస్తున్న కుటుంబాలను, ఎక్కువగా దళితులను భయభ్రాంతులకు గురిచేశాడు. డబ్బులు డిమాండ్‌ చేస్తూ, బెదిరింపులు మరియు దుర్భాషలాడుతూ ఇళ్లలోకి ప్రవేశించాడు. యాదవ్‌ యొక్క అత్యాచార బాధితులు డజన్ల కొద్దీ నేరాన్ని నివేదించారు, కానీ పోలీసు చర్య తీసుకోలేదు. ప్రసవించిన పది రోజుల తర్వాత కల్మా అనే మహిళపై యాదవ్, అతని అనుచరులు సామూహిక అత్యాచారం చేశారు. దీంతో కల్మా ఆత్మహత్య చేసుకుంది. ఏడు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో యాదవ్‌ గ్యాంగ్‌ మరో మహిళను ఆమె ఇంటి నుంచి లాక్కెళ్లి నడీ రోడ్డుపై అత్యాచారం చేశారు. బాదితుల ఫిర్యాదుతో పోలీసులు అతడిని 14 సార్లు అరెస్ట్‌ చేసినా.. తిరిగి బయటకు వచ్చాక తన అఘాయిత్యాలు కొనసాగిస్తూ వచ్చాడు. దశాబ్దం తర్వాత అతని పాపం పండింది. బాధితులే అపర కాళికలై న్యాయదేవత సాక్షిగా అంతం చేశారు. సాక్ష్యాలు లేని కారణంగా అతడిని చంపిన మహిళలంతా విడుదలయ్యారు.

పోలీసుల అలసత్వానికి, మహిళలకు రక్షణ కల్పించాలనే ఉద్దేశం లేకపోవడానికి యాదవ్‌ ఉదంతం ఒక ఉదాహరణ. చట్టం విఫలమైతే బాధితులే శిక్షిస్తారనేందుకు ఈ ఘటన నిదర్శనం.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Exit mobile version