Kedarnath Temple: భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే శైవక్షేత్రాల్లో కేదార్‌నాథ్ మందిరం ఒకటి. పరమశివుడు కొలువై ఉన్న ఈ ఆలయాన్ని చేరుకోవడానికి భక్తులు ఎన్నో వ్యయప్రయాసలు పడతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా శివుడి దర్శనం కోసం ఏటా వెళ్తూనే ఉంటారు. హిందువులంతా పరమ పవిత్రంగా భావించే కేదార్‌నాథ్ పరమ శివుని దర్శనానికి వెళ్లిన ఓ మహిళ.. అపచారానికి పాల్పడింది. ఆది భిక్షువు అయిన శివలింగంపై కరెన్సీ నోట్లు చల్లింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో కాంట్రవర్సీ వీడియోలు
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏదైనా కాంట్రవర్సీకి సంబంధించిన వీడియోలు అయితే క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. ఇటీవల తిరుపతి గర్భగుడి వీడియోను ఓ భక్తుడు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. గతంలో అనేక ఆలయాలకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. తాజాగా ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాథ్ దేవాలయం గర్భగుడిలో అపచారం చోటు చేసుకుంది. ఓ మహిళా భక్తురాలు శివలింగపై నోట్లు చల్లుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.. దీంతో శివ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శివయ్యను చేరుకోవడమే ఓ సాహసం..
కేదార్‌నాథ్ మందిరం ఉత్తరాఖండ్‌లోని మందాకిని నదికి సమీపంలో గర్హాల్ హిమాలయ శ్రేణిలో ఉంది. ఇక్కడ వాతావరణ పరిస్థితుల కారణంగా ఏప్రిల్, నవంబర్ మాసంలో మాత్రమే ప్రజలకు ఆలయాన్ని తెరచి ఉంచుతారు. అయినా అక్కడికి వెళ్లాలంటే భక్తులు సాహసం చేయాల్సిందే. శీతాకాలంలో కేదార్‌నాథ్ ఆలయం నుంచి దేవతా విగ్రహాన్ని కిందకు తీసుకువచ్చి ఆరు నెలల వరకు పూజలు నిర్వహిస్తారు. కేదార్‌నాథ్‌ను శివుని నిలయంగా భక్తులు పూజిస్తుంటారు. అలాంటి పవిత్రమైన కేదార్‌నాథ్ ఆలయ గర్భగుడిలో ఓ మహిళ అపచారానికి పాల్పడింది. అంతేకాదు శివుని శివలింగంపై కరెన్సీ నోట్లను వర్షంలా కురిపించింది.
శివభక్తురాలిగా..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ తెల్ల చీర, మెడలో రుద్రాక్షలు ధరించి కేదార్‌నాథ్ గర్భగుడిలోని శివలింగపై నోట్లు చల్లుతూ తన్మయత్వంలో మునిగిపోయి నృత్యం చేస్తూ కనిపించింది. మరోవైపు ఆమె పక్కన కొంతమంది భక్తులు ఈ తతంగాన్ని ఆపకుండా ప్రోత్సహించడం గమనించవొచ్చు. ఈ వీడియో చూస్తున్న హిందుల మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని.. పరమశివుడి ఆగ్రహానికి గురైతే అరిష్టం తప్పదని అంటున్నారు. పవిత్ర దేవాలయంలో ఇలాంటి అపచారం సహించేది లేదని అంటున్నారు. వెంటనే మహిళపై చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఆ మహిళ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
గర్భగుడిలోకి అనుమతి..
వాస్తవానికి కేదార్‌నాథ్ ఆలయంలోని గర్భగుడిలోకి చాలా తక్కువ మందిని అనుమతిస్తారు. ఇక్కడ పరిసర ప్రాంతాల్లో వీడియో, ఫొటోలు తీయడం నిషేధం. కానీ ఓ మహిళ గర్భగుడిలోకి వెళ్లడమే కాదు.. శివలింగంపై కరెన్సీ నోట్లు వెదజల్లుతూ అనుచితంగా ప్రవర్తించింది. ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఈ ఘటనపై శ్రీ బద్రినాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ డాక్యూమెంట్ రూపంలో అధికారికంగా ఓ ప్రెస్‌నోట్ రిలీజ్ చేసింది. స్థానిక రుద్రప్రయాగ్ జిల్లా కలెక్టర్, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అయితే గర్భగుడిలోకి వీడియోని ఎవరు అనుమతించారు.. అధికారులు ఏం చేస్తున్నారని హిందూ సంఘాల వారు ప్రశ్నిస్తున్నారు.