Ram Mandir: అయోధ్య బాల రాముడికి భారీ వేణువు.. కానుకగా ఇచ్చిన ముస్లిం కుటుంబం!

జనవరి 26న ఈ వేణువును అయోధ్య ధామ్‌కు తరలించనున్నారు. నవాబ్ కుటుంబం 2021లో 16 అడుగుల పొడవైన వేణువును తయారు చేసింది. ఈ వేణువు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.

Written By: Raj Shekar, Updated On : January 21, 2024 10:45 am

Ram Mandir

Follow us on

Ram Mandir: భారతీయుల 500 ఏల్ల కల మరికొన్ని గంటల్లో సాకారం కాబోతోంది. అయోధ్య నగరంలో ఆది పురుషుడు, జగదభి రాముడు కొలువుదీరనున్నాడు. జనవరి 22న గర్భాలయంలో ప్రధాని నరేంద్రమోదీ బాల రాముడికి ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. ఈమేరకు రామాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక బాల రాముడికి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికి వారు తమకు తోచిన కానుకలను అయోధ్య నగరానికి పంపుతున్నారు.

భారీ వేణువు కానుకగా..
ఈ క్రమంలో 21.6 అడుగుల పొడవు ఉన్న భారీ వేణువును ఫిలిబిత్‌కు చెందిన ఓ ముస్లిం కుటుంబం అయోధ్య రాముడికి కానుకగా ఇవ్వబోతోంది. ఈమేరకు దానిని అయోధ్యకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిలిబిత్‌కు చెందిన ప్రముఖ హస్తకళాకారుడు నవాబ్‌ అహ్మద్‌ భార్య హీనా ఫర్వీన్‌ అతని కొడుకు అర్మాన్ నబీ, అతని స్నేహితులతో కలిసి దీనిని తయారు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కు చెందిన హరీశ్‌ రౌతేలా ఆ వెనువుకు పూజలు చేశారు.

26న అయోధ్యకు..
జనవరి 26న ఈ వేణువును అయోధ్య ధామ్‌కు తరలించనున్నారు. నవాబ్ కుటుంబం 2021లో 16 అడుగుల పొడవైన వేణువును తయారు చేసింది. ఈ వేణువు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. తాజాగా 21.6 అడుగుల వేణువును తయారు చేశాడు. ఇదే ప్రపంచంలోనే అత్యంత పొడవైన వేణువుగా నిలువనున్నది. అర్మాన్ కుటుంబం వేణువులను తయారు చేస్తుంది.

అసోం వెదురు కర్రతో..
ఈ భారీ వేణువును అసోంకు చెందిన వెదురు కర్రతో ఈ వేణువును తయారు చేశారు. ఇందుకోసం 20 ఏళ్ల క్రితమే వెదురు కర్రను సేకరించి పెట్టామని నవాబ్‌ అహ్మద్‌ కుటుంబం తెలిపింది. అయోధ్య రామయ్యకు కానుకగా ఉపయోగపడుతుందని మాత్రం అనుకోలేదని వెల్లడించింది.

వేణువు ప్రత్యేకతలు..
ఇక రామయ్యకు కానుకగా ఇవ్వనున్న ఈ వేణువు వ్యాసం 3.5 అంగుళాలు. ఇక అసోం వెదురుకు ప్రత్యేకత ఉంది. ఇలాంటి వెదురు ప్రస్తుతం అందుబాటులో లేదు. ఈ వేణువును తయారు చేయడానికి పది రోజులు పట్టిందని నవాబ్‌ కుటుంబం తెలిపింది. ఈ వేణువును రెండువైపులా గానం చేయవచ్చు. దీని తయారీకి రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చయింది. దీనిని ప్రత్యేకంగా ట్రక్కులో అయోధ్య ధామ్‌కు తరలించనున్నారు.