Matchbox: పెట్రోల్, డిజీల్, వంట గ్యాస్, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడం ఎప్పుడో ప్రారంభించాయి. వీటికి కారణం కేంద్ర ప్రభుత్వమా లేదా రాష్ట్ర ప్రభుత్వమా అనే చర్చ వద్దు. ఎందుకంటే సామాన్యులను ఇబ్బంది పెట్టడంలో అన్నీ తమ వంతు పాత్ర ఖచ్చితంగా పోషిస్తూనే ఉన్నాయి. కేంద్రమేమో రాష్ట్ర ప్రభుత్వాల మీద, రాష్ట్ర ప్రభుత్వాలేమో కేంద్ర ప్రభుత్వం మీద ఈ నెపం నెట్టేస్తూ ఉన్నాయి. ఎవరికి వారు తమ తప్పేంలేదంటూ సమర్థించుకుంటున్నాయి. కానీ వాటిని భరించేంది మాత్రం ఓ సామన్యుడు అని గుర్తించలేకపోతున్నాయి. కరోనా సంక్షోభం తరువాత ఇప్పటికే చిక్కిశల్యమైన మధ్యతరగతిజీవిపై ఈ భారం కూడా వేస్తే తప్పేంటని భావిస్తున్నాయి కాబోలు.

అన్నీ భరించే గొప్పోడు సామాన్యుడు..
ధరలు పెరిగితే వాటిని నిశ్శబ్దంగా భరించే గొప్పోడు సామాన్యుడు. వాటికి కారణం కేంద్రమా, రాష్ట్రమా అని ఆలోచించడు. అయినా ఈ బలహీన జీవికి ఆలోచించే తీరిక ఉండదు ఉన్నా దానిపై పోరాటం చేసే సత్తువ కూడా ఉండదు. గ్యాస్ ధర పెరిగినా, డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగినా కిక్కుమనకుండా ఉంటాడు. తనలో తానే వెక్కి వెక్కి ఏడుస్తాడు. తన జీవిత ప్రారబ్ధం ఇంతేనని భావిస్తాడు. ఫేస్‌బుక్కుల్లో, వాట్సాప్ స్టేటస్సులో తన ఆందోళనను వ్యక్తపరిచి, మళ్లీ తన దారి తాను చూసుకుంటాడు. మరీ అక్కడే చర్చలు చేస్తూ కూర్చుంటే ఇల్లు గడవదు కదా. ఇటు ఆదాయేమో పెరగదు, అటు ధరలేమో పెరగకుండా ఉండవు. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేయాలో తెలియక సతమతమవుతుంటాడు.
పెద్ద బండ మీద.. మరో బండ..
ఇప్పటికే సామాన్యుడికి అవసరం అయిన అన్ని ధరలు పెరిగాయి. వాటిని ఎలాగోలా నెట్టుకొస్తూ జీవితాన్ని వెళ్లదీస్తున్నారు మధ్య తరగతి జీవులు. ఇంత పెద్ద భారాన్నే మోస్తున్న జనాలకు ఇంకో షాక్ ఇస్తే తట్టుకుంటారు అనుకునట్టు ఉంది ఓ నిత్యవసర వస్తువు. చాలా రోజులగా నా ధర పెరగలేదని, కానీ ఇప్పుడు పెరగక తప్పడం లేదంటూ తన ప్రతాపాన్ని చూపించడానికి ముందుకు వస్తోంది ఓ అగ్గిపెట్టే. ఇంత పెద్ద భారాన్నే మోస్తున్న మధ్య తరగతి బతుకులకు నా బరువు ఏం ఎక్కువ కాబోదని భావిస్తునాన్ని చెబుతోంది. ఇంకో నెల రోజుల్లో నన్ను రెట్టింపు ధరతో కొనుగోలు చేసుకోవాలని నవ్వుతోంది ఆ అగ్గిపెట్టె..
పెరిగిన ముడి సరుకు ధరలే కారణమా.. ?
అగ్గిపెట్టె ధరలు పెరగడానికి పెరిగిన ముడి సరుకు ధరలే కారణంగా తెలుస్తోంది. ఇన్ని రోజులు రూ. 425గా ఉన్న రెడ్ పాస్పరస్ ధర, రూ. 810కి, రూ.58గా ఉన్న మైనం ధర ఇప్పుడు రూ.80 కి చేరుకుంది. వీటి తయారీ వ్యయం కూడా రెట్టింపు కావడంతో ధర కూడా పెరగబోతోంది. దాదాపు 14 ఏళ్లుగా అగ్గిపెట్ట ధర పెరగకుండా కొనసాగుతోంది. ఇప్పుడు అదీ పెరగడం సామాన్యుడిని కలవరపెట్టే అంశం.