Kalyanam Raghuramaiah: శ్రీకృష్ణుడు ఎలా ఉంటాడు అని ఎవరినైనా అడిగితే నందమూరి తారకరామారావు ఫొటో చూపిస్తారు. ఆ తరువాత శోభన్ బాబు లాంటి వారి గురించి చెబుతున్నారు. కానీ శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడు.. అని ఆయన వేషం వేసిన వ్యక్తి ఎన్టీఆర్ కంటే ముందే ఉన్నారు. ఆయన తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖ నటుడే కాదు… ఇందిరా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహా వ్యక్తుల చేత ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాకుండా ఆయన నోట్లో వేలు పెట్టి సంగీతం చేసేవారు. ‘కళ్యాణం రఘురామయ్య’గా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ఆయన గురించి మీకోసం..
తెలుగు ఇండస్ట్రీ గురించి చెప్పాలంటే ఎన్టీఆర్.. ఆ తరువాత తరం వారి గురించి చెబుతూ ఉంటారు. కానీ అంతకుముందే ఎందరో మహానుభావులు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. అయితే అప్పుడు ఇంతలా ప్రచార సాధనాలు లేకపోవడంతో పెద్దగా రికార్డుల్లో నమోదు కాలేదు. కానీ కొందరు వారి గురించి పుస్తకాల్లో, పత్రికల్లో రాశారు. అవి ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడుతున్నారు. ఈ సందర్భంగా తెలుగు ఇండస్ట్రీలో లెజెండ్ నటుడిగా కొనసాగిన వారిలో ‘కళ్యాణం రఘురామయ్య’ ఒకరు.
కల్యాణం రఘురామయ్య అసలు పేరు.. కళ్యాణం నరసింహారావు. ఈయన ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుజిల్లా సుద్దపల్లిలో 1901 మార్చి 5న జన్మించారు. చిన్నప్పటి నుంచే నరసింహారావుకు నాటకాలంటే బాగా ఇష్టం. ఎక్కడ అవకాశం వచ్చినా వదులుకునేవాడు కాదు. అలా ఓసారి రఘురాముని పాత్ర వేశాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడి పాత్రను వేశాడు. అప్పటి నుంచి ఆయనను కళ్యాణం రఘురామయ్య అని పిలుస్తున్నారు. ఈయన నందమూరి తారకరామారావు కంటే ముందే రాముడు, శ్రీకృష్ణుడి పాత్రలు వేయడం విశేషం.
కేవలం నటన మాత్రమే కాకుండా రఘురామయ్యకు మరో అద్భుతమైన కళ ఉంది. అదేంటంటే నోట్లో వేలు పెట్టి సంగీతం చేసేవారు. రఘురామయ్యకు ఈ సంగీతం పుట్టుకతోనే వచ్చింది. ఆవులను కాస్తూ ఇలా పాటలు పాడేవారు. ఆ తరువాత ఓ ప్రముఖుడి దృష్టిలో ఈ కళ ఆకర్షించడంతో ఆయన గుంటూరుకు వచ్చారు. ఆ తరువాత ఆయన జీవితం మారిపోయింది. కాశీనాథుని నాగేశ్వర్ రావు ఈయనకు కళ్యాణం రఘురామయ్య అని నామకరణం చేశారు.
కొన్ని సినిమాల్లో నటించడంతో పాటు పలు నాటకాల్లో ఎక్కువగా వేసేవారు. ఈయన ప్రతిభ చూసి జవహర్ లాన్ నెహ్రు, ఇందిరా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వారు ప్రశంసించారు. ఇక దేశంలోనే కాకుండా ఆ కాలంలో జపాన్ వెళ్లి అక్కడ కృష్ణుడి గెటప్ తో అలరించారు. ఇన్ని సేవలు చేసిన ఆయనకు కేంద్ర సాహిత్య అవార్డుతో సత్కరించింది. అంతేకాకుండా ఇందిరాగాంధీ తనను స్వయంగా పిలిపించుకొని తన ఈల పాట విని ఎంతో సంతోషించారు.