Homeఅప్పటి ముచ్చట్లుహీరో అవ్వాల్సిన వాడు గొప్ప దర్శకుడయ్యాడు !

హీరో అవ్వాల్సిన వాడు గొప్ప దర్శకుడయ్యాడు !

అది 1970 నాటి కాలం.. ‘నటరత్న ఎన్టీఆర్, సూపర్ కృష్ణ’లా తానూ ఎందుకు హీరో కాకూడదు అనుకున్నాడు ఓ కుర్రాడు. కట్ చేస్తే తానూ ఎలాగైనా హీరో కావాలనే లక్ష్యంతో మద్రాసులో అడుగుపెట్టాడు. ‘కుర్రాడు బాగానే ఉన్నాడు కదరా, సరే హీరోని చేసేద్దాంలే గానీ ముందు టీ ఇప్పించమను’ అని అప్పట్లో ఒకరు ఇద్దరు పోరంబోకులు ఆ కుర్రాడికి మాయమాటలు చెప్పి.. మొత్తానికి అతని చేతిలో ఉన్న ఆ చిల్లరను కాస్త మింగేశారు. చివరకు కుర్రాడికి తత్త్వం బోధపడింది.

హీరో మాట దేవుడెరుగు బతికి ఉంటే హీరో అయినట్టు కలలు కనొచ్చు అనుకుని పొట్ట నింపుకోవడానికి చిన్న హోటల్ లో జాయిన్ అయ్యాడు. ఆ తరువాత పదేళ్లు గడిచిపోయాయి. మళ్ళీ కట్ చేస్తే.. ఆ కుర్రాడి డేట్లు కోసం నిర్మాతలు వరుసగా అతని ఇంటిముందు పడిగాపులు కాస్తున్నారు. కాకపోతే ఆ కుర్రాడు హీరోకు బదులు డైరెక్టర్‌ కావడం విధి లిఖితం. హీరో అవ్వాల్సిన వాడు డైరెక్టర్ గా మారడానికి కారణం ఆకలి. ఇండస్ట్రీలో బతకాలి అంటే.. ముందు నిలబడాలి,

నిలబడాలంటే ఏదొక విభాగంలో పండిపోవాలి. అది తెలుసుకున్న ఆ కుర్రాడు దర్శకుడిగా పండిపోయాడు. వరుసగా 13 హిట్లు ఇచ్చాడు. పైగా తానూ చిన్నప్పటి నుండి అభిమానించిన అక్కినేని నాగేశ్వరరావునే డైరెక్ట్‌ చేసి మేటి దర్శకుల సరసన చేరాడు. అంతేనా చిరంజీవి మెగాస్టార్ అవ్వడానికి కీలక పాత్రను పోషించాడు. మోహన్‌బాబు, బాలకృష్ణ, నాగార్జున..ఇలా అగ్రహీరోలందరితోనూ అదిరిపోయే సూపర్ హిట్ చిత్రాలు చేసి.. ఆయా హీరోల కెరీర్ లోనే మంచి చిత్రాలను అందించాడు.

ఇంత చేసినా ఆ దర్శకదిగ్గజానికి గర్వం లేదు. పైగా చేసిన సినిమాల్లో అధిక శాతం హిట్లే. అన్నిటికి మించి అతను కమర్షియల్‌ సినిమాను శాసించాడు. హిట్ సినిమాకి కేరాఫ్‌ అడ్రెస్‌ గా నిలిచాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరనేగా పేరు ‘ఎ. కోదండరామిరెడ్డి’. తను హీరో కాకపోయినా తన కొడుకు వైభవ్‌ ను హీరోని చేసి, తన చిరకాల కలను అలా నెరవేర్చుకున్నాడు. కోదండరామిరెడ్డి నెల్లూరులోని మైపాడు అనే గ్రామంలో పుట్టి పెరిగారు.

ఆ గ్రామంలో ఓ సినిమా షూటింగ్ జరగడం చూసిన దగ్గర నుండి ఆయనకు హీరో కావాలనే ఆశ కలిగింది. కానీ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం కాబట్టి.. తానే కష్టపడి హీరో అవుదామని మద్రాసు రైలెక్కాడు. గొప్ప దర్శకుడిగా చిరస్థాయిగా తెలుగు చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular