స్వేచ్ఛ లేని మీడియా.. స్వాతంత్ర్యం లేని జర్నలిస్టులు!

శ్రీను (పేరు మార్చాం)  ఏడేళ్లుగా ఓ ప్రముఖ పత్రికలో చేస్తున్నాడు. సొంతూళ్లో పెద్ద జర్నలిస్టుగా పేరుంది. కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఊడింది. ఇంటికొచ్చాడు. నెలదాటింది. పూట గడవడం కష్టమైంది. దీంతో సమీప పట్టణంలో ఓ టిఫిన్ సెంటర్ పెట్టాడు. పేరున్న జర్నలిస్ట్ ఇలా హోటల్ పెట్టడంపై ఊళ్లో రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఏం చేస్తాం.. ఇప్పుడు పరువు కంటే.. బతకడం ముఖ్యం. అందుకే మాన అభిమానాలు వదిలేసి అతడు తనది కాని పనిలో సెటిల్ కావడానికి […]

Written By: NARESH, Updated On : September 27, 2020 6:21 pm

press_freedom copy

Follow us on


శ్రీను (పేరు మార్చాం)  ఏడేళ్లుగా ఓ ప్రముఖ పత్రికలో చేస్తున్నాడు. సొంతూళ్లో పెద్ద జర్నలిస్టుగా పేరుంది. కానీ కరోనా దెబ్బకు పోస్ట్ ఊడింది. ఇంటికొచ్చాడు. నెలదాటింది. పూట గడవడం కష్టమైంది. దీంతో సమీప పట్టణంలో ఓ టిఫిన్ సెంటర్ పెట్టాడు. పేరున్న జర్నలిస్ట్ ఇలా హోటల్ పెట్టడంపై ఊళ్లో రకరకాలుగా మాట్లాడుకున్నారు. కానీ ఏం చేస్తాం.. ఇప్పుడు పరువు కంటే.. బతకడం ముఖ్యం. అందుకే మాన అభిమానాలు వదిలేసి అతడు తనది కాని పనిలో సెటిల్ కావడానికి ప్రయత్నిస్తున్నాడు.

Also Read: ప్రభుత్వరంగ వ్యవస్థలను చంపేస్తున్నదెవరు?

ఇక మరో జర్నలిస్టు జర్నలిజంపై ఆశతో వచ్చాడు. ఐదేళ్లు చేశాడు. అతడికి కరోనా దెబ్బకు ఆ పత్రిక ఇంటికి పంపింది. చేసేందేం లేక డీటీపీ, ఫ్లెక్సీ, ఇంటర్నెట్ సెంటర్ ను కలిపి పెట్టుకున్నాడు.దాంతోనే ఉపాధి పొందుతున్నారు.

ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే.. కరోనా కాటుకు ఎంతో మంది జర్నలిస్టులు రోడ్డున పడ్డారు. కరోనా పిడుగు జర్నలిస్టులపై యమ పాశమైంది. వందల మంది జర్నలిస్టులు ఇప్పుడు జర్నలిజాన్ని వదిలి వేరే వ్యాపారాలు చేసుకుంటున్న దైన్యం కనిపిస్తోంది.

జర్నలిజంలో ఓ పాడు సామెత ఉంది.. అదేంటంటే ‘అందరికీ పత్రికల ద్వారా చెప్పడానికే నీతులుంటాయి.. కానీ అవి పాటించడానికి మాత్రం పనికి రావు..’ హక్కులు.. పోరాటాల గురించి పేజీలకు పేజీలు రాసి సమాజాన్ని ఉద్దరించే జర్నలిస్టుల జీవితాల్లో మాత్రం ఆ స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు ఉండవు.. భూతద్దం పెట్టి వెతికినా మచ్చుకైనా కనిపించవు.. యాజమాన్యాల కబంధ హస్తాల్లో.. పార్టీల కనుసైగల్లో జర్నలిస్టుల బతుకులు చుక్కాని లేని నావలా సాగిపోతున్నాయి… జీతం లేనిదే పూట గడవని జర్నలిస్టులు ఆయా యాజమాన్యాల కింద కుక్కిన పేనులా పనిచేస్తూ పోతున్నారు..

కలంతో సమాజాన్ని ఉద్ధరించడం కాదు.. ముందు మనం జీవితాలను ఉద్దరించుకుందాం.. ఎక్కడైనా హక్కుల కోసం రోడ్డెక్కి సాధించుకున్న కార్మికులను, కర్షకులను చూసాం.. కానీ ఏ జర్నలిస్టులైనా చూశామా..? ఎందుకంటే రోడ్డెక్కితే ఉద్యోగాలు ఊడిపోతాయి.. వ్యతిరేకంగా పనిచేస్తే జాబ్ లోంచి తీసేస్తారు.. మనం చేసిన తప్పులు పక్కోడు యాజమాన్యానికి చెప్పి తీసిసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. అందుకే ఆఖరికి కాకులు, జంతువుల్లో ఉన్న ఐక్యత కూడా జర్నలిస్టుల్లో ఉండదంటే అతిశయోక్తి కాదు..

తెలుగులోని అన్ని ప్రధాన పత్రికల్లోంచి జర్నలిస్టులను భారీగా తీసేశారు. కరోనా తగ్గి, జిల్లా సంచికలు తెరిస్తే మళ్లీ పిలుస్తామంటున్నారు. ఇప్పటికీ ఆరునెలలు గడిచాయి. కరోనా తగ్గలేదు. పెరిగిపోతోంది.జిల్లా సంచికలు తీసే పరిస్థితి లేదు. పాఠకులు డిజిటల్ మీడియాకు డైవర్ట్ అయిపోతున్నారు. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తే ఉద్యోగాలు ఇస్తారనే ఆశతో జర్నలిస్టులు రోడ్డెక్కడం లేదు. ఆ ఆశే వారిని మౌనంగా ఉండేలా చేస్తోంది. కానీ పూట గడవాలి కదా.. అందుకే డైవర్ట్ అవుతున్నారు.

Also Read: వ్యవసాయ‘బిల్లు’ తెచ్చిన చేటు.. 23 ఏళ్ల బంధానికి బ్రేకప్‌

చాలా మంది జర్నలిస్టులు వేరే వ్యాపారాల్లోకి వెళ్లిపోతున్నారు. అక్కడ క్లిక్ అయితే ఇక జర్నలిజానికి మంగళమే. పత్రికలు, చానెల్స్ ప్రకటనలు ఇచ్చినా ఏ జర్నలిస్ట్ భవిష్యత్తులో ఈ కత్తిమీద సాములాంటి ఉద్యోగాల్లోకి ఖచ్చితంగా రాడు. ఎందుకంటే మొదట బలిపశువులు అయ్యేది జర్నలిస్టులే. అందుకే ఈ వృత్తిని వదిలేస్తున్నారు. భవిష్యత్తులో జర్నలిస్టుల సంఖ్య తగ్గిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదని.. ఇలాంటి వృత్తిలోకి.. రక్షణ, ఉద్యోగభద్రత లేని వ్యాపకంలో ఎవరూ రారని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. జర్నలిజానికి బయట విలువ ఎంతో ఉంది. కానీ అందులో పనిచేసే వారికే లేదు.. ఇది కాదనలేని సత్యం..!

-నరేశ్