
ఏపీ బీజేపీ నేతలతో సఖ్యత లేదని జనసేనాని పవన్ కళ్యాణ్ ఇటీవల తిరుపతిలో వ్యాఖ్యానించిన తరువాత ఏపీ బీజేపీ అలెర్ట్ అయ్యింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా హైదరాబాద్ వచ్చి పవన్ తో భేటి అయ్యారు. ఈరోజు మరోసారి జనసేన-బీజేపీ నేతల మధ్య చర్చలు జరిగాయి.
ప్రధానంగా తిరుపతి లోక్ సభ స్థానం ఉపఎన్నికపై బిజె పి – జనసేన నేతల మధ్య సుధీర్ఘంగా చర్చలు జరిగాయి. హైదరాబాద్ లో మూడు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో ముఖ్యంగా ఉప ఎన్నికలో అనుసరించబోయే వ్యూహం, లోక్ సభ స్థానం పరిధిలోని బి.జె.పి – జనసేన నాయకులు, శ్రేణులను సమాయత్తం చేయడం వంటి విషయాలపై ఈ సమావేశంలో దృష్టి పెట్టారు. అదే విధంగా ప్రచారం, ఈ ప్రచారానికి బి.జె.పి. అగ్రనాయకత్వాన్ని ఆహ్వానించడం వంటి విషయాలపై ఒక నిర్ణయానికి వచ్చారు.
అయితే అభ్యర్ధి ఎంపికపై ఇంకో దఫా చర్చలు జరపాలని నిర్ణయించారు. ఇరు పార్టీలకు సంబంధించిన అభ్యర్ధుల వివరాలను పరిశీలించిన తరువాత అభ్యర్ధిని ఎంపిక చేయాలని నిశ్చయించారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో జరగనున్న పంచాయితీ ఎన్నికలపై కూడా చర్చ జరిగింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషన్ పట్ల సీఎం జగన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ సమావేశం గర్హించింది. ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి పరిస్థితులు చూడలేదన్నారు.
రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించడం రాష్ట్ర ప్రభుత్వ విధి అని, అలా గౌరవించని పక్షంలో ప్రజాస్వామ్యంపై ప్రజలకు నమ్మకం పోయే ప్రమాదం ఉందని సమావేశం అభిప్రాయపడింది. బీజేపీ, జనసేన ముఖ్య నేతలందరూ ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే తిరుపతి సీటు ఎవరు తీసుకోవాలి? ఎవరు పోటీచేయాలనే దానిపై మాత్రం సమావేశం ఏకాభిప్రాయానికి రాలేదని సమాచారం.