తెలుగు సినిమా పరిశ్రమ అప్పుడప్పుడే మద్రాసు నుంచి హైదరాబాద్ కి షిప్ట్ అవుతోన్న రోజులు అవి. పైగా అప్పుడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్నారు. అందుకే ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్ కి రావడం ఈజీ అయింది. పరిశ్రమ హైదరాబాద్ లో సెటిల్ అయింది. ఎన్టీఆర్ గారు, మురళీమోహన్ కి కబురు పెట్టారు. అప్పటికే తెలుగు దేశం పార్టీ కోసం ప్రచారం కూడా చేశారు మురళీమోహన్. అందుకే ఆయనకు ‘ఎఫ్‌డీసీ ఛైర్మన్’ పదవిని ఇవ్వాలని ఎన్టీఆర్ భావించారు.
నిజానికి అప్పటికీ మురళీమోహన్ కంటే, ఇండస్ట్రీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. వాళ్లకిస్తే బావుంటుందనేది చాలామంది పెద్దల అభిప్రాయం కూడా. పైగా ఎఫ్‌డీసీ ఛైర్మన్ కావాలనే కోరిక చాలామందికి ఉంది. కానీ, ఎన్టీఆర్ ముక్కుసూటి మనిషి. ఒకసారి ఒక్కరికి ఇస్తా అని మనసులో అనుకుంటే.. ఇక ఆయన మాట తప్పరు. అందుకే మురళీమోహన్ మనసులో తర్జనభర్జన పడుతున్నారు.
అది గమనించిన ఎన్టీఆర్ ‘నీకు తెలియనిది ఏముంది బ్రదర్ ? ఈ సినిమా పరిశ్రమలో బోలెడన్ని గ్రూపులున్నాయి. కొందరికి ఆ పదవి మీద మనసు ఉంది. కానీ వారిలో ఒకరికి ఇస్తే, మరో గ్రూప్ వారికి బాధ కలుగుతుంది. పదవి పొందిన వారి పై అసూయతో పాటు విమర్శలు కూడా చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. నువ్వు మాత్రమే అందరినీ కలుపుకుని పోగలవు. నాకు నమ్మకం ఉంది’ అంటూ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చారు.
కానీ మురళీమోహన్ లో ఎక్కడో భయం, ఆ పదవి బాధ్యత తనకు అదనపు భారం అవుతుందేమో అని. దీనికితోడు ఆ పదవి తానూ తీసుకుంటే, ఆ పదవి పై ఇంట్రెస్ట్ చూపిస్తోన్న అప్పటి ప్రముఖ నిర్మాతకి కోపం వస్తోంది. అసలుకే చీటికీ మాటికీ ప్రెస్ ముందుకు వెళ్లి తిట్లు తిట్టడం ఆయనకు అలవాటు. కానీ ఎన్టీఆర్ మాటను కాదనలేని పరిస్థితి.
ఆ సమయంలో అక్కడ ఉన్న ఏఎన్నార్ కలుగజేసుకుని ‘అవును మురళీ. ఆ పదవికి నువ్వయితేనే కరెక్ట్. బ్రదర్ చెప్పినట్టు చెయ్యి’ అని దైర్యం చెప్పారు. దాంతో ఇక మురళీమోహన్ కి ఎఫ్‌డీసీ ఛైర్మన్ బాధ్యతలు తీసుకోక తప్పలేదు. అయితే, ఆ పదవిలో ఆయన ఎక్కువ కాలం పని చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో రాగానే ఆయన తన పదవికి రాజీనామా చేశారు.