ఆ రోజుల్లో నటుడు నారాయణరావుకి (Narayana Rao) మంచి పేరు వచ్చింది. ముఖ్యంగా 1976 లో వచ్చిన అంతులేని కథ సినిమాలో తాళికట్టు శుభవేళ పాటకు ఆయన నటించిన తీరు అమోఘం. దాంతో నారాయణరావు కోసం నిర్మాతలు వెతుకులాట మొదలుపెట్టారు. 1977లో స్టార్ హీరోల సైతం ఎవడు ఈ కుర్రాడు బాగున్నాడు అనుకున్నారు. కానీ, ఆ తర్వాత నారాయణరావు సినీ జీవితం ఆశించిన స్థాయిలో ఎదగలేదు.
ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ లాంటి సినిమాలలో హీరోగా నటించారు. కానీ విజయాలు దక్కలేదు. అవకాశాలు కూడా తగ్గాయి. స్టార్ అవ్వాల్సిన వాడు, చిన్న పాత్రల కోసం కూడా ప్రాకులాడ వలసి వచ్చింది. ఓ దశలో ఆయన సినిమా రంగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నారు.
నటుడిగా తనకు రావాల్సినంత గుర్తింపు రాలేదు అనే బాధ ఆయనను ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. ఈ లోపు కాలం కూడా మారిపోయింది. హీరోల శైలి మారింది. చిరంజీవి లాంటి కొత్త తరం నటులు ప్రవాహంలో నారాయణరావు అనే హీరో ఉన్నాడు అనే ఆలోచన కూడా జనం మర్చిపోయారు. చివరకు ఆయనకు చిన్నాచితకా పాత్రలు రావడం ఆగిపోయాయి.
కానీ, ఆయన నిరుత్సాహపడలేదు. మళ్లీ ఎలాగైనా సినిమాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నారు. తనకు ఎవరూ అవకాశాలు ఇవ్వడం లేదు. అసలు తనకు ఇంకొకరు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలి. తానే ఇంకొకరికి ఎందుకు ఛాన్స్ ఇవ్వకూడదు అనే ఆలోచన ఆయనలో రేకెత్తింది. ఆ తర్వాత ఆయన నిర్మాతగా మారారు. పలు సక్సెస్ ఫుల్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి ఎందరికో అవకాశాలు ఇచ్చారు. హీరోగా ఆయన పతనమే.. నిర్మాతగా ఆయన విజయం.