Ahuti Prasad: కొంతమంది నటుల్లో టాలెంట్ ఉన్నా గుర్తింపు రాదు. కారణం కెరీర్ లో సరైన క్యారెక్టర్ రాకపోయి ఉండొచ్చు. సినిమాల్లో ఎప్పుడైనా ఒకరి నటన హైలైట్ కావాలంటే వారి టాలెంట్ కి తగ్గ పాత్ర పడాలి. ఒక నటుడిలోని భిన్న కోణాలను ఆవిష్కరించాలి అంటే.. వైవిధ్యమైన పాత్ర పడాలి. అలాంటి పాత్రలు రావాలి అంటే.. గొప్ప పేరు ఉండాలి. పెళ్ళి కుదిరితే తప్ప పిచ్చి కుదరదు, పిచ్చి కుదిరితే తప్ప పెళ్ళి కుదరదు అన్నట్టు ఉంటుంది ఈ వ్యవహారం.
నటుడు ఆహుతి ప్రసాద్ గారు సినీ కెరీర్ ఇందుకు మంచి ఉదాహరణ. 1988లోనే ఆహుతి సినిమాతో ఆయనకు బ్రహ్మాండమైన బ్రేక్ వచ్చింది. ఆ సినిమాలో నేరుగా ప్రధానమైన విలన్ పాత్ర. అది కూడా నలిగిపోయిన పాత పద్ధతిలో కాకుండా గ్లాస్కో బట్టలు కట్టుకొని, బయటకు నీతి నిజాయితీల గురించి, అవినీతి పరులను ఆటకట్టిస్తానన్నట్టు మాట్లాడుతూ ప్రజలను బురిడీ కొట్టిస్తూ అందలం ఎక్కాలనుకునే గడుసు విలన్ పాత్ర.
ఒకవిధంగా ఇలాంటి పాత్ర పోషించడం, అదీ కెరీర్ మొదట్లోనే చేయడం గొప్ప అవకాశం, ఛాలెంజ్ కూడా. ఆహుతి నిరూపించుకున్నారు. కానీ ఆ తర్వాత మళ్ళీ అలాంటి అవకాశం ఆయనకు రెండు దశాబ్దాల పాటు రాలేదు. ఇందుకు కొంతవరకూ ఆయన తీసుకున్న నిర్ణయాలే కారణం. ఒక ఇంటర్వ్యూలో 1990లో తాను నటించిన పోలీస్ భార్య సినిమా విజయవంతం కావడంతో, కొని కన్నడలో తీశాననీ, అది సూపర్ హిట్ అయ్యేసరికి నిర్మాతగా కొనసాగానని, ఇంతలో భారీ ఫ్లాపులు వచ్చి పూర్తిగా మునిగిపోయాననీ ఆయన చెప్పారు.
ఈ లోపు కన్నడలో నిర్మాత అయ్యాడు అంటూ పేరు బడి.. నటుడిగా ఇక సరిగ్గా చేస్తాడో లేదోనని పక్కన పెట్టేశారు. అలా 1996 వరకూ దెబ్బతిన్నారు. ఇక చేసేది ఏమి లేక అఫీస్ ల చుట్టూ తిరుగుతూ అవకాశాలు వెతుక్కుంటూ ముందుకు సాగారు. అయితే, రాజమార్గంలో మొదలైన కెరీర్ గతుకుల రోడ్డులో పడింది. మెయిన్ విలన్ గా చేయాల్సిన వాడు, విలన్ పాత్రలకు మద్దతుగా ఏవేవో సహాయ పాత్రలు చేయాల్సి వచ్చింది.
సహజ నటుడు ఆహుతి ప్రసాద్ నిర్మాతగా మారడమే ఆయనకు పెద్ద శాపం అయింది. అయితే, కృష్ణవంశీ ‘నిన్నే పెళ్ళాడతా’లో హీరోయిన్ తండ్రి వేషం ఇచ్చారు. అది క్లిక్ అయ్యింది. అందులోంచి తండ్రి పాత్రల్లోకి ఒదిగిపోయారు. ఆ తరువాత కృష్ణవంశీ “చందమామ” వచ్చింది. ఆ సినిమాలో ఆయన పాత్ర ఆయనను స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను చేసింది. ఇక అక్కడ నుంచి చనిపోయే వరకు ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.