
ఈ మధ్య కాలంలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో పార్టీలు ఇస్తున్న హామీలు ప్రజలకు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. కేరళలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. జాతీయ పార్టీలలో ఒకటైన కాంగ్రెస్ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ సారథ్యం వహిస్తున్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ నుంచి ఈ మేనిఫెస్టో విడుదల కావడం గమనార్హం.
యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మేనిఫెస్టోలో ఆనందమయ శాఖను ఏర్పాటు చేస్తామనే విచిత్రమైన హామీని ఇవ్వడంతో పాటు 40 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న ప్రతి మహిళకు 2,000 రూపాయలు ఇస్తామని కీలక ప్రకటన చేసింది. నెలవారీ పెన్షన్లను 3,000 రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటన చేయడంతో పాటు నిరాశ్రయులైన కుటుంబాలకు నెలకు 6,000 రూపాయలు ఇస్తామని వెల్లడించింది.
పెట్టుబడిదారుల పరిరక్షణ చట్టం తీసుకొని వస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ బిజినెస్ చేసేవాళ్లకు భరోసా ఇవ్వడంతో పాటు బలవంతంగా వ్యాపారాలను మూసివేయడంపై, సమ్మెలపై నిషేధం విధిస్తామని పేర్కొంది. తెల్ల రేషన్ కార్డ్ ఉన్నవాళ్లకు ఫ్రీగా ఐదు కిలోల బియ్యం ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ గృహిణులకు పింఛన్ ఇవ్వడంతో పాటు ఉచితంగా గృహాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
రాష్ట్రంలో ఏకంగా ఐదు లక్షల ఉచిత ఇళ్లను ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం గమనార్హం. యూడీఎఫ్ శబరిమల ఆలయం సాంప్రదాయాలను కాపాడటం కొరకు ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న తల్లులకు రెండు సంవత్సరాల వయోపరిమితిని పెంచుతున్నామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం.