
T20 World Cup: భారత్ లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ యూఏఈ, ఒమన్ లకు తరలిపోయింది. సెప్టెంబర్ 17న యూఏఈలో ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే చాలా దేశాలు తమ జట్లను ప్రకటించగా.. బుధవారం సాయంత్రం టీమిండియా జట్టును ప్రకటించనున్నారు. చేతన్ శర్మ నేృత్వంలోని సెలక్షన్ కమిటీ ఇంగ్లండ్ లో ఉన్న కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రితోపాటు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ, కార్యదర్శి జైషాతో ఇప్పటికే సమావేశమైంది. జట్టు ఎంపికపై చర్చించారని సమాచారం.
ఈరోజు సాయంత్రం బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కరోనా మహమ్మారి పరిస్థితుల నేపథ్యంలో 18మంది లేదా 20 మంది ఆటగాళ్ల బృందాన్ని బీసీసీఐ ఎంపిక చేయనుంది.
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ కు జట్టు ఆటగాళ్లపై సెలెక్షన్ కమిటీ ఓ స్పష్టతకు వచ్చినట్టు సమాచారం. సౌరవ్ గంగూలీ, రవిశాస్త్రి కూడా జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించినట్టు సమాచారం.
ప్రధానంగా చూస్తే.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్రజడేజా, యజ్వేంద్ర చాహల్, షమీ, శార్ధుల్ ఠాకూర్ లకు భారత టీ20జట్టులో చోటు దాదాపు ఖరారైనట్టేనని సమాచారం.
అయితే యూఏఈలో పిచ్ లపై జీవం ఉండదు.. నెమ్మదిగా ఉంటాయి. దాంతో అక్కడ స్పిన్నర్లు రాణించే అవకాశాలు అధికం. అందుకే భారత జట్టు స్పిన్ విభాగంపై దృష్టి సారించినట్టు సమాచారం. చాహల్, జడేజాతోపాటు వరుణ్ చక్రవర్తి, రాహుల్ చహర్ తోపాటే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ను కూడా ఎంపిక చేయాలని చూస్తున్నట్టు సమాచారం.
మూడో ఓపెనర్ స్థానం కోసం ఇసాన్ కిషన్, ఫృథ్వీ షా, శిఖర్ ధావన్ లు పోటీ పడుతున్నట్టు సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరికి చాన్స్ దక్కవచ్చన్న ప్రచారం సాగుతోంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్నీ జరుగనుంది. తొలి మ్యాచ్ లో భారత్ అక్టోబర్ 24న పాకిస్తాన్ ను ఢీకొంటుంది.