జగన్ స్పీడు మామూలుగా లేదుగా.. గద్దెనెక్కినప్పటి నుంచి సంక్షేమ పథకాలైనా.. అభివృద్ధి పనులైనా సరే శరవేగంగా పూర్తి చేస్తూ జగన్ హీట్ పెంచుతున్నారు. ప్రతి పనిని టార్గెట్ పెట్టి పూర్తి చేస్తున్నారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్ట్ మొదలైందంటే ప్రచారానికే ఎక్కువగా పరిమితమయ్యేవారు. కానీ జగన్ మాత్రం ప్రచారానికి దూరంగా పనులపైనే దృష్టిసారించడం విశేషంగా మారింది.
ఏపీ ప్రజల వరప్రదాయిని అయిన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయడానికి సంకల్పించడంతో వేగంగా జరుగుతోంది. తాజాగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లర్ల నిర్మాణం పూర్తయ్యింది. 52 పిల్లర్లకు సంబంధించి ఒక్కోటి 52 మీటర్ల ఎత్తున పిల్లర్ల నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. స్పిల్ వే నిర్మాణం పూర్తి కావాలంటే 52 మీటర్ల ఎత్తున పిల్లర్లు నిర్మించాల్సి ఉంటుంది.
ఇటీవలే డిజైన్లు అన్నీ అనుమతులు వచ్చాక త్వరిత గతిన నిర్మాణం పూర్తి చేసి స్లాబ్ లెవల్ కు అంటే సరాసరిన 52 మీటర్ల ఎత్తుకు అన్ని పిల్లర్ల నిర్మాణం పూర్తి చేశారు. స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ పొడవు 1128 మీటర్లకు గానూ ఇప్పటికే 1095 మీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. స్పిల్ వే పిల్లర్లపై పెట్టాల్సిన గడ్డర్లు 192 కాగా ఇప్పటికే 188 గడ్డర్లు పిల్లర్లపై ఏర్పాటు చేశారు. 4 గడ్డర్లు మాత్రమే పిల్లర్లపై పెట్టాల్సి ఉంది.
2019 నవంబర్ లో స్పిల్ వే పిల్లర్లు కాంక్రీట్ నిర్మాణం ప్రారంభించారు. జులై 2020 లో స్పిల్ వే పిల్లర్లు పై గడ్డర్లు ఏర్పాటు చేశారు.., స్పిల్ వే బ్రిడ్జ్ స్లాబ్ కాంక్రీట్ సెప్టెంబర్, 9 2020 లో మొదలు పెట్టింది. అనతికాలంలోనే స్పిల్ వే పనులను పూర్తి చేయడం విశేషం.
గత ఏడాది జులైలో స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్లు ఏర్పాటు చేశారు. స్పిల్ వే గేట్ల ఏర్పాటు కూడా సగానికి పైనే పూర్తయ్యింది. స్పిల్ వే బ్రిడ్జిలో మొత్తం 48 గేట్లు ఏర్పాటు చేయాల్సి ఉండగా… ఇప్పటికే 28 గేట్లను ఏర్పాటు చేయడం విశేషం. మరో ఏడాదిలోనే ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రజలకు సాగు తాగునీరు అందించాలని ఏపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకెళుతోంది