జగన్ సర్కార్ ను ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ వదలడం లేదు. వదలా బొమ్మాళి అంటూ వెంటాడుతూనే ఉన్నాడు. జగన్ సర్కార్ స్థానిక ఎన్నికల నిర్వహణకు ఎన్ని అడ్డంకులు చూపాలో అన్నీ చూపిస్తున్నా వాటికి కౌంటర్లు వేస్తూ నిమ్మగడ్డ బెట్టు వీడడం లేదు. ఈ ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణకు రెడీ అవుతున్నారు. కానీ జగన్ సర్కార్ మాత్రం ఎన్నికల నిర్వహణకు ససేమిరా అంటోంది. ఈ ఫైట్ హైకోర్టు సాక్షిగా మరోసారి బయటపడింది.
కరోనా వ్యాక్సినేషన్ దృష్ట్యా ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని జగన్ ప్రభుత్వం హైకోర్టులో తాజాగా పిటీషన్ వేసింది.. దీనికి ఎస్ఈసీ నిమ్మగడ్డ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తోందని.. ఎన్నికల విధుల్లో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు తెలిపిందని ఎస్ఈసీ నిమ్మగడ్డ గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ, బీహార్, రాజస్థాన్ లో ఎన్నికలు జరిగిన విషయాన్ని గుర్తించాలని కోరారు.
కరోనా వ్యాక్సిన్ పంపిణీ పేరుతో ఎన్నికలు అడ్డుకోవద్దని.. రాష్ట్రవ్యాప్తంగా గతంలో రోజుకు 10వేల కేసులు.. ఇప్పుడు 3వేల కేసులు మాత్రమే ఉన్నాయని నిమ్మగడ్డ కోర్టుకు తెలిపారు. అన్ని తెరుచుకున్నాయని.. ఇప్పుడు ట్రయల్స్ దశలోనే వ్యాక్సిన్ ఉందని ఎస్ఈసీ కోర్టుకు వివరించారు. ప్రజలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేసరికి 3 నుంచి 6 నెలల సమయం పడుతుందని.. ఎన్నికల వల్ల వ్యాక్సిన్ పంపిణీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని నిమ్మగడ్డ హైకోర్టులో వాదించారు. ప్రభుత్వం వేసిన పిటీషన్ ను డిస్మిస్ చేయాలని హైకోర్టును కోరారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పట్టుదలగా ఉన్నాడు. జగన్ సర్కార్ నిర్వహించలేమని తేల్చిచెప్పింది. దీంతో హైకోర్టు సాక్షిగా వీరి ఫైట్ మరోసారి నడిచింది. వాదనలు ముగిసిన అనంతరం ఈ పిటీషన్ పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.