దర్శకధీరుడు రాజమౌళి తీర్చిదిద్దుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. బాహుబలితో తన మార్కెట్ ను ప్రపంచవ్యాప్తం చేసిన రాజమౌళి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చుకున్నాడు. తాజాగా తీస్తున్న ‘ఆర్ఆర్ఆర్’పై బోలెడు అంచనాలున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలుగా నటిస్తున్నారు.
పాన్ ఇండియా మూవీగా తీస్తున్న ఈ మూవీ విడుదల కోసం ప్రేక్షకులతోపాటు డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు సైతం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఆర్ఆర్ఆర్ సినిమా డిజిటల్ హక్కులను విక్రయించినట్లు కథనాలు వెల్లడిస్తున్నాయి. స్టార్ నెట్ వర్క్ సంస్థ ఈ సినిమా ఓటీటీ హక్కులను అక్షరాలా రూ.200 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ హక్కులను స్టార్ నెట్ వర్క్ సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
థియేటర్ లో రిలీజ్ చేసిన తర్వాత ఈ మూవీని నేరుగా ఓటీటీ ఫ్లాట్ ఫాం డిస్నీ+హాట్ స్టార్ లో అందుబాటులో ఉంచుతారు. దీనికోసమే డిస్నీ సంస్థ ఏకంగా 200 కోట్ల రూపయాలు ఆఫర్ చేసినట్టు సమాచారం.
ఇప్పుడు ఓటీటీలతోనే 200 కోట్ల లాభం వస్తే.. ఇక థియేటర్స్ లో రిలీజ్ అయితే ఇంకెంత లాభం వస్తుందనేది ఊహకందని విధంగా ఉంది. అయితే ఈ వార్తపై అధికారిక ప్రకటన ఏదీ రాలేదు. ఇదే నిజమైతే ఆర్ఆర్ఆర్ కు విడుదలకు ముందే కొత్త రికార్డులు నెలకొల్పినట్టు అవుతుంది. ఈ సినిమా బడ్జెట్ 350 కోట్లు కాగా.. ఓటీటీలతోనే 200 కోట్లు వచ్చినట్టు అవుతుంది.