
టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి తీస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రం రిలీజ్ డేట్ ఇటీవలే ప్రకటించారు. అయితే అదే సమయానికి ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్ తీసిన ‘మైదాన్’ చిత్రం కూడా ఆ సమయంలోనే రిలీజ్ అవుతోంది. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ప్రకటనపై ఆరోజే బోనీకపూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా ఈ కోల్డ్ వార్ కొనసాగుతోంది.
ఈ క్రమంలోనే మరోసారి తాజాగా బోనీకపూర్ ఈ వివాదంపై మరోసారి నోరుపారేసుకున్నారు. ఒకనెలలో రెండు రోజుల తేడాతో ఒకే హీరో నటించిన చిత్రాలు విడుదల చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
‘మైదాన్’ చిత్రంలో అజయ్ దేవగణ్ హీరో. ఇక ఆర్ఆర్ఆర్ లోనూ కీలక పాత్రలో అజయ్ దేవగణ్ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలు అక్టోబర్ 13,15వ తేదీల్లో రిలీజ్ అవుతున్నాయి.
మైదాన్ మూవీని 15న రిలీజ్ చేస్తుండగా.. దానికంటే రెండు రోజుల ముందు 13న ‘ఆర్ఆర్ఆర్’ విడుదలవుతోంది. దీంతో ఇది అనైతికమని బోనీకపర్ మండిపడుతున్నాడు.
విడుదల తేది విషయమై ఇటీవల నేను రాజమౌళితో ఫోన్ లో మాట్లాడాను.. విడుదల తేదీతో తనకు సంబంధం లేదని.. అది నిర్మాతల ఇష్టప్రకారం జరిగిందని నాతో చెప్పారని బోనీకపూర్ తెలిపారు. కానీ రాజమౌళి మాటలను నేను నమ్మాలనుకోవడం లేదు. నాకు తెలిసి ‘ఆర్ఆర్ఆర్’ విడుదల గురించి అజయ్ దేవగణ్ కు కూడా ముందుగా సమాచారం ఇచ్చారనుకోవడం లేదు. ఇండస్ట్రీలో మంచి పేరున్న రాజమౌళి నుంచి నేను ఇలాంటి చర్య ఊహించలేదు అని బోనీకపూర్ తాజాగా సంచలన కామెంట్స్ చేశారు.