కాపు ఉద్యమాన్ని రగిలించిన ఉద్యమనేత ముద్రగడ పద్మానాభంకు గట్టి షాక్ తగిలింది. కాపుల కోసం గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో పోరాడిన ఈ మాజీ మంత్రి ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆయనకు కోర్టు గట్టి షాక్ ఇచ్చింది.
కాపులను బీసీల్లో చేర్చాలని.. కాపు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని..కాపు సామాజికవర్గానికి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తోపాటు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నాడు కాపు ఉద్యమ నేత అయిన ముద్రగడ పద్మనాభం ఆందోళనకు పిలుపునిచ్చాడు. కాపు రిజర్వేషన్ పోరాట సమితి చేపట్టిన ఈ ఆందోళన పోలీసుల దురుసు ప్రవర్తనతో హింసాత్మకంగా మారింది.
2016 జనవరి 31న తూర్పు గోదావరి జిల్లాలోని తునిలో రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు దహనమైంది. ఆందోళనకారులు రైలును దగ్ధం చేయడం ఉద్రిక్తతకు దారితీసింది.
ఏపీలో సంచలనమైన ఈ ఘటనలో ఉద్యమనేత అయిన ముద్రగడ సహా పలువురు కాపు నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ రైలు దగ్ధం కేసులో రైల్వే చట్టంలోని పలు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముద్రగడతోపాటు సుధాకర్ నాయుడు తదితరులపై ఈ కేసులు నమోదయ్యాయి.
ఈ కేసులో తాజాగా ముద్రగడతోపాటు నిందితులకు విజయవాడ రైల్వే కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఈ ఏడాది మార్చి 3న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో నేతలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.