
దేశవ్యాప్తంగా కరోనా విస్తృతి విపరీతంగా పెరుగుతోంది. ఆ పెరుగుదలతోపాటు కేసులు, మరణాల సంఖ్య కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశంలోనే కరోనా పాజిటివిటీ రేటులో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉండడం షాకింగ్ గా మారింది. ఏపీ పరిస్థితిపై తాజాగా కేంద్రం ఆందోళన కూడా వ్యక్తం చేసింది.
ఏపీతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు పెరగడంపై కేంద్రప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ తొలి నాళ్ల నుంచి ఏపీలో పాజిటివిటీ రేటు పెరిగిపోతోందని కేంద్రవైద్యఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. ఏపీలో వారం వృద్ధిరేటు 30శాతం వరకు ఉందని.. చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయని కేంద్రమంత్రి హర్షవర్ధన్ తెలిపారు.
ఏపీతోపాటు కరోనా పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల పరిస్థితులపై కేంద్రమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. సమీప గ్రామాల నుంచి రోగులు పట్టణాలకు వచ్చే అవకాశం ఉన్నందున ఆస్పత్రుల్లో సౌకర్యాలు పెంచాలని సూచించారు.
దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కరోనా కేసుల పెరుగుదల కనిపిస్తున్న 8 రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని కేంద్రవైద్యఆరోగ్యశాఖ తెలిపింది.
దేశంలోనే పాజిటివిటీ రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా తమిళనాడు ఉందని.. ఆ తర్వాత ఏపీ ఉందని తెలిపారు. ఆ తర్వాత స్థానాల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా; పంజాబ్, అసోం, హిమాచల్ ప్రదేశ్, పుదుచ్చేరి ఉన్నట్లు తెలిపారు. దేశంలో నిరంతరం కేసులు పెరుగుతున్న జిల్లాలు 15 ఉండగా.. అందులోతూర్పుగోదావరి 6వ స్థానంలో ఉంది. విశాఖ 10వ స్థానంలో, కడప 12వ స్థానంలో ఉంది.