
పోలవరంలో ఎన్నో వింతలు.. విశేషాలు.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు.. ప్రపంచమే అబ్బురపడేలా నిర్మాణాలు.. ఇలా ఏపీ కలల ప్రాజెక్ట్ నిర్మాణంలో అద్భుతాలు ఆవిష్కృతం అవుతున్నాయి. ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా భారీ జలవిద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే భారీ జల విద్యుత్ కేంద్రం కావడం విశేషంగా చెప్పొచ్చు. పోలవరంలో నిర్మించేది దేశంలోనే అరుదైన జల విద్యుత్ కేంద్రాల్లో ఒకటి కావడం మన తెలుగు రాష్ట్రానికి గర్వకారణం.
పోలవరం జల విద్యుత్ కేంద్రాన్ని 960 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్నారు. ఈ భారీ జలవిద్యుత్ కేంద్రాన్ని మేఘా సంస్థ నిర్మిస్తోంది. లక్ష్యం మేరకు పూర్తిచేస్తున్నారు. నిర్మాణం పూర్తయ్యాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఇదే పెద్ద జలవిద్యుత్ కేంద్రంగా పేరుపొందింది. దేశంలో తెహ్రీ, కొయినా, నాత్ప, సర్దార్ సరోవర్ జల విద్యుత్ కేంద్రాలు ఇప్పటిదాకా పెద్దవిగా ఉన్నాయి. వాటిని పూర్తిగా జల విద్యుత్ కేంద్రాల కోసం నిర్మించినవే కావడం విశేషం. సర్దార్ సరోవర్‌లో బహుళ ప్రయోజనాలు కూడా ఉన్నాయి.అయితే ఏపీలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం బహుళార్ధ ప్రయోజనాల కోసం నిర్మించింది కావడం గమనార్హం.
ఎడమ గట్టున గ్యాప్ ప్రాంతంలో పవర్ హౌస్ నిర్మించారు. తూర్పుగోదావరి జిల్లా అంగులూరు వద్ద ఈ నిర్మాణం చేపట్టారు. ప్రాజెక్ట్ కు కుడివైపున స్పిల్ వే ఏర్పాటు చేశారు. ఎడమ వైపున జల విద్యుత్ కేంద్రం నిర్మించారు. ఇదే పోలవరంలో మరో ప్రత్యేకతగా నిలిచింది. సాధారణంగా స్పిల్‌వేకు అనుకొనే జల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తారు. కానీ పోలవరంలో రెండింటికి సంబంధం లేకుండా నిర్మాణం చేపట్టడం విశేషంగా చెప్పొచ్చు. స్పిల్ వే ఒకవైపు, పవర్ హౌస్ మరోవైపు ఉండేలా ప్లాన్ చేశారు. ఒక్కొక్కటి 80 మెగావాట్లతో 12 యూనిట్ల ఏర్పాటు చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో మిగతా ప్రాజెక్టుల జలవిద్యుత్ సామర్థ్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే.. శ్రీశైలంలో కుడిగట్టు కేంద్ర సామర్థ్యం 770 మెగావాట్లు.. శ్రీశైలంలో ఎడమగట్టు కేంద్ర సామర్థ్యం 900 మెగావాట్లు.. తొలుత కుడి కేంద్రం నిర్మించి ఇటీవలనే ఎడమ కేంద్ర నిర్మాణం పూర్తి చేశారు. ఇక నాగార్జున సాగర్ జల విద్యుత్ సామర్థ్యం 770 మెగావాట్లు.. వాటన్నింటికన్నా పోలవరం సామర్థ్యం ఎక్కువ కావడం విశేషం.
పోలవరానికి ప్రతి ఏడాది వరదలు అనివార్యంగా వస్తుంటాయి. గోదావరికి వరద ప్రవాహం ఎక్కువ. వరదలను అదుపు చేయడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టారు. 27 మీటర్ల ఎత్తు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం ద్వారా జల విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పొందే అవకాశం పోలవరంతో సాధ్యమైంది. ఒక్కొక్క యూనిట్ నుంచి 331 క్యుసెక్కుల నీటి విడుదల చేస్తారు. ఒక్కొక్క యూనిట్ నుంచి 2308.41 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొందే అవకాశం ఉంది. జల విద్యుత్ తర్వాత నీరు ట్రైల్‌రేస్ నుంచి కుడివైపునకు గోదావరిలోకి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ఈ విధమైన ఇంజనీరింగ్ అరుదుగా పోలవరంలోనే చేపట్టడం మన ప్రాజెక్టు గర్వకారణంగా చెప్పొచ్చు.
త్వరలోనే ఈ ప్రాజెక్టును, జలవిద్యుత్ కేంద్రాన్ని మేఘా సంస్థ పూర్తి చేసి జాతికి అంకితం చేసే దిశగా ఏపీ సాగు, తాగునీటిని తీర్చే దిశగా వడివడిగా ముందుకు సాగుతోంది.