బీజేపీ–జనసేన ముందు నుంచీ ఏపీలో మిత్రపక్షంగానే కొనసాగుతున్నాయి. కానీ.. ఈ మధ్య వచ్చిన కొన్ని వివాదాలతో పొరపొచ్చాలు వచ్చాయి. పొత్తులో భాగంగా పవన్ తిరుపతి లోక్‌సభ సీటును సైతం బీజేపీకి త్యాగం చేశారు. ఈ క్రమంలో పవన్ ఈ ఎన్నికలో ప్రచారానికి వస్తారా లేదా అనే అంశం ఇన్ని రోజులుగా సందిగ్ధంలో ఉంది. గత రోజులుగా నెలకొన్ని ఈ ప్రచారానికి తెరదించుతూ.. ఇరు పార్టీల నేతలు కలుసుకున్నారు. విభేదాలకు ఆస్కారం లేకుండా కలిసి ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తు చేసుకున్నారు.
ఎలాగైనా తిరుపతిలో పాగా వేయాలని ఇరు పార్టీలూ గట్టి తీర్మానమే చేశాయి. తిరుపతి ఉప ఎన్నిక బరిలో పొత్తులో భాగంగా బీజేపీ తరపు అభ్యర్థి రత్నప్రభ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు బీజేపీ ఒంటెత్తు పోకడలపై మిత్రపక్షమైన జనసేన అసంతృప్తిగా ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పైగా జనసేనతో సంబంధం లేకుండా బీజేపీ సమన్వయ కమిటీలు ప్రకటించడంతో.. కూటమిలో విభేదాల ప్రచారానికి బలం కలిగించినట్టైంది. అసలు ఇరు పార్టీల మధ్య పొత్తు ఉందా అనే అనుమానాలు కలిగాయి.
ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్‌లో జనసేనాని పవన్‌కల్యాణ్‌ను రత్నప్రభతోపాటు బీజేపీ అగ్రనేతలు కలిశారు. పవన్‌ను ప్రచారానికి రావాలని బీజేపీ నేతలు ఆహ్వానించారు. అనంతరం రత్నప్రభ నామినేషన్ వేసేందుకు ముందురోజు రాత్రి తిరుపతిలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన, బీజేపీ సమన్వయ కమిటీ సమావేశం జరగడం, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడం జరిగినట్లు సమాచారం.
పైగా ఈ సమావేశానికి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ తమ పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కోరినట్టుగా బీజేపీ అగ్రనాయకత్వం మంచి అభ్యర్థిని బరిలో నిలిపిందన్నారు. ఎన్నికల ప్రచారానికి వారంలో పవన్ వస్తారని ఆయన ప్రకటించారు. క్షేత్రస్థాయిలో రెండు పార్టీలు సమన్వయంతో కలిసి పనిచేయాలనే సంకల్పంతో తాను తిరుపతికి వచ్చినట్టు మనోహర్ తేల్చి చెప్పారు. ఇన్ని రోజులకు పవన్ కల్యాణ్ తిరుపతి ఎన్నికల్లో ప్రచారంపై క్లారిటీ వచ్చేసింది. మనోహర్ ప్రకటనతో కార్యకర్తల్లో ఆనందం వెల్లివెరిసింది.