
ఏపీ ఎన్నికల ‘పంచాయితీ’ గవర్నర్ వద్దకు చేరింది. ఏపీ ప్రభుత్వం, మంత్రులపై ఫిర్యాదు చేయడానికి గవర్నర్ వద్దకు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ రాగానే ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. వెంటనే మంత్రులు, ఏపీ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి అదే సమయంలో రాజ్ భవన్ కు వచ్చారు.దీంతో కాసేపు నిమ్మగడ్డకు, మంత్రికి మధ్య ఘర్షణ వాతావరణం అలుముకుంటుందా అన్న అనుమానాలు కలిగాయి. పరస్పరం ఫిర్యాదులు చేసుకొని ఈ ‘పంచాయితీ’ని మరింత వేడెక్కించారు.
ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ తాజాగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రేపు జరుగబోయే పంచాయతీ తొలివిడత ఎన్నికలకు సంభందించిన అంశాలతో పాటు.. రాష్ట్ర మంత్రులు తనపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసిన అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.
మరోవైపు గవర్నర్ విశ్వభూషణ్ తో మంత్రి బుగ్గన, ప్రవీణ్ ప్రకాశ్ సమావేశం అయ్యారు. ఎస్ఈసీ రాజ్ భవన్ లో ఉన్న సమయంలోనే ఏపీ మంత్రి కూడా రాజ్ భవన్ లోకి వెళ్లడం ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో అక్కడ కొది సేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గవర్నర్ తో ఎస్ఈసీ సమావేశ అనంతరం సమావేశమైన మంత్రి బుగ్గన, ప్రవీణ్ ప్రకాశ్ ప్రభుత్వం పై ఎస్ఈసీ వ్యవహరిస్తున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఎస్ఈసీ ప్రభుత్వం మీద కక్ష కట్టారని, మంత్రులను అధికార సమావేశాలకు వెళ్లకుండా అడ్డుకోవడం ఏంటని, ఎస్ఈసీపై చర్యలు తీసుకోవాలని వారు గవర్నర్ కు విజ్ఙప్తి చేశారు.
ఇరు పక్షాలు పరస్పర ఫిర్యాదుతో కాసేపు అక్కడి వేడి పుట్టించారు. గవర్నర్ సర్ధి చెప్పి సామరస్యంగా ఎన్నికలు నిర్వహించాలని ఇరు వర్గాలకు హితబోధ చేసినట్టు సమాచారం. దీంతో శాంతించి వెళ్లిపోయినట్టు తెలిసింది.