
ఈ మధ్య కాలంలో మద్యం రేట్లు ఆకాశాన్ని తాకుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలలో సంవత్సరం సంవత్సరానికి మద్యం రేట్లు అంతకంతకూ పెరుగుతున్నాయి. దుస్తులపై, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటిస్తారు కానీ మద్యంపై ఎప్పుడో తప్ప ఆఫర్లు ప్రకటించరు. అయితే ఒక నాయకుడు మాత్రం కేవలం రూపాయికే క్వార్టర్ మద్యం ప్రకటించాడు. ప్రముఖ సినీ దర్శకుడు ఎన్ శంకర్ పై ఉన్న అభిమానాన్ని అభిమాన నాయకుడు ఈ విధంగా చాటుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లాలో అధికార పార్టీకి చెందిన చింతకుంట విష్ణు అనే వ్యక్తికి దర్శకుడు ఎన్ శంకర్ అంటే అభిమానం. ఎన్ శంకర్ పెళ్లిరోజు సందర్భంగా విష్ణు మందుబాబులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. రూపాయికే క్వార్టర్ మద్యం ఇప్పించి తన అభిమానాన్ని చాటుకున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ లో దాదాపు 60 నిమిషాల పాటు మద్యం పంపిణీ కార్యక్రమం జరిగింది.
దర్శకునిపై ఉన్న అభిమానాన్ని నాయకుడు విష్ణు వినూత్నంగా చాటుకోవడం గమనార్హం. అయితే ఈ వింత ఆఫర్ ను కొందరు ప్రశంసిస్తుంటే మరి కొందరు మాత్రం విమర్శిస్తున్నారు. విష్ణు మందుబాబులకు టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్ల ద్వారా వాళ్లు మద్యం కొనుగోలు చేసేలా చేశారు. 45 మంది మందుబాబులు ఈ ఆఫర్ ను వినియోగించుకుని మద్యం కొనుగోలు చేసినట్లు సమాచారం.
విష్ణు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి పేద ప్రజలకు కడుపునిండా భోజనం పెట్టారు. రూపాయికే మద్యం ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది. అయితే అభిమానాన్ని విష్ణు చాటుకున్న విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.