
సుప్రీంకోర్టులో ఏపీ పంచాయితీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సవాల్ చేసిన జగన్ సర్కార్ కు శృంగభంగం ఎదురైంది. దీంతో ఇప్పుడు ఏపీలో తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత జగన్ సర్కార్ పై పడింది. పట్టుబట్టిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పంతం నెగ్గడంతో ఆయన మరింత దూకుడుగా ముందుకెళుతున్నారు.
ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటీషన్లను సుప్రీంకోర్టు కొట్టి వేస్తూ ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణకు అనుమతించడంతో నిమ్మగడ్డ దూకుడు పెంచాడు. సుప్రీంలో తీర్పు వెలువడగానే వెంటనే నిమ్మగడ్డ పంచాయితీ ఎన్నికలను రీషెడ్యూల్ చేశారు.
నిజానికి మొదటి విడత ఎన్నికలకు సోమవారం నుంచే నామినేషన్లు ప్రారంభబం కాగా.. ప్రభుత్వ ఉద్యోగులు ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రారంభించలేదు. ఇప్పుడు సుప్రీంతీర్పుతో ప్రభుత్వం, ఉద్యోగులు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభుత్వ సంసిద్ధతను దృష్టిలో ఉంచుకొని మొదటి ఎన్నికల నోటిఫికేషన్ ను నాలుగో విడతకు నిమ్మగడ్డ రీషెడ్యూల్ చేశారు.
మార్చిన రీషెడ్యుల్ ప్రకారం ఫిబ్రవరి 9,13,17,21 తేదీల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ వెల్లడించారు. మొదటి దశలో 29 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. ఈరోజు నుంచి ప్రారంభం కావాల్సిన మొదటి దశ షెడ్యూల్ మాత్రం నాలుగో దశకు మారింది. రెండు, మూడు, నాలుగు విడతల ఎన్నికలు యథావిధిగా ముందుగా ప్రకటించిన విధంగా జరుగుతాయని ఎస్ఈసీ నిమ్మగడ్డ తెలిపారు. రెండో ఫేజ్ లో జరగాల్సిన ఎన్నికలు ఇప్పుడు మొదటి దశలోనూ.. 3,4 దశల్లో జరగాల్సిన ఎన్నికలు రెండు, మూడు దశల్లో జరుగుతాయి.