
కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు తాజాగా ఓ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. మరి మోహన్ బాబు ఏమి చెప్పారో విందాం. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుండి వచ్చినవాన్ని నేను. మా నాన్నగారు ఎలిమెంట్రీ స్కూల్ టీచర్. చిన్నతనం నుండే నీతి, న్యాయం, ధర్మంగా ఉండాలని నేర్చుకున్నాను. ఇండస్ట్రీకి వచ్చాక మా గురువుగారు దాసరిగారి దగ్గర క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఎవరికీ పుట్టుకతోనే అన్నీ రావాలని లేదు, రావు కూడా. కొన్ని చూసి నేర్చుకోవాల్సి వస్తోంది. నేర్చుకోవాలి కూడా.
ఇక విజయాలు వచ్చినప్పుడు ప్రశంసించేవారు ఉంటారు, అపజయాలు ఎదురైనప్పుడు విమర్శించే వాళ్లు ఉంటారు. కానీ ఏది జరిగినా శాంతంగా ఉండటం నేర్చుకోవాలి. గట్టిగా పిండితే గువ్వ అయినా ఎగిరి తంతుంది అని ఎదుటి వ్యక్తిని అవమానించే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఇక ప్రస్తుతం నా పరిస్థితి మౌనమే. నా టీమ్, ఆత్మీయులు, మిత్రులు కొందరు పోయారు.
ఇక పొలిటికల్ గా నేను కొత్తగా చూడటానికి ఏమి లేదు. నేను రాజకీయంగా అన్నీ చూశాను. అప్పట్లో నేను తెలుగుదేశంలో ఉన్నాను. కేవలం అన్నగారు ఎన్టీఆర్ గారి కోసం నేను రాజకీయాల్లోకి వెళ్ళాను. ఆయన నన్ను రాజ్యసభకి పంపించారు. ఆ తర్వాత వైఎస్ గారితో మంచి అనుబంధం ఉంది. ఆయన ముఖంలో, ఆ పంచె కట్టులో ఓ రాజసం ఉండేది.
వైఎస్ గారు కూడా ఎన్టీఆర్‌గారిలా మాట ఇస్తే దానికి కట్టుబడేవారు. ఇక రాజకీయంగా నా మనసును గాయపరిచిన వ్యక్తి చంద్రబాబు. అలాగే చాలా మందికి తెలియదు. హెరిటేజ్ ఫుడ్స్ నాదే. ఆ సంస్థలో నా డబ్బు, నా షేర్ ఎక్కువ. కానీ చంద్రబాబు నన్ను మోసం చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం నేను ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమా చేస్తున్నాను.