
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దూకుడు ఆ పార్టీలో విభేదాలకు కారణమవుతున్నట్టు ప్రస్తుత పరిణామాను బట్టి తెలుస్తోంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా మాట్లాడిన ఆడియో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపింది. బండి సంజయ్ తనను మోసం చేశాడంటూ ఆ ఆడియోలో రాజాసింగ్ వాపోయిన తీరు తీవ్ర సంచలనమైంది. ఆ ఆడియో నిజమైనదో కాదో తెలియదు కానీ.. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో పెద్ద దుమారం రేపుతోంది.
Also Read: బండిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదా..?
అయితే సోషల్ మీడియాలో ఈ లీకైన ఆడియోటేపుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంతవరకు స్పందించలేదు. దీనిపై ఆయన స్పందించాల్సి ఉంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తనను మోసం చేశారంటూ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించినట్లుగా చెబుతున్న ఆడియో టేపు ఒకటి వైరల్ అవుతోంది. ట్వీట్ కూడా దుమారం రేపుతోంది. గోషామహల్ పరిధిలో తన వర్గానికి చెందిన కార్యకర్తలకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశారని.. త్వరలోనే ఢిల్లీ నాయకత్వానికి దీనిపై ఫిర్యాదు చేస్తానని అన్నట్టుగా ఆ ఆడియోలో ఉంది.
Also Read: బండి సంజయ్‌ని హైకమాండ్ కంట్రోల్ చేసిందా..?
గ్రేటర్ లోని 150 డివిజన్లలో ఎక్కడా జోక్యం చేసుకోనని..కానీ గోషామహల్ లో వదిలేయాలని చెప్పినా బీజేపీ నేతలు పట్టించుకోకుండా నాకు అన్యాయం చేశారని.. ఇష్టారాజ్యంగా టికెట్లు ఇచ్చారని ఆ ఆడియోలో రాజాసింగ్ ఆరోపించారు.
ఇక టికెట్ దక్కక ఆత్మహత్య చేసుకున్న కార్యకర్త గురించి కూడా ఆ ఆడియోలో రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘తన ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారని.. ప్రస్తుతం తాను ఆ ఘటనతో విషాదంలో ఉన్నా’నని రాజాసింగ్ పేరుతో విడుదలైన ఆడియోలో ఉంది. రెండు, మూడు రోజుల తర్వాత స్థానిక నేతలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నట్లుగా ఉంది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
‘2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున నేను ఒక్కడినే గెలిచా. అది ఇక్కడి కార్యకర్తల వల్లే సాధ్యమైంది. అలాంటి కార్యకర్తల్లో ఇవాళ ఒక్కరికి కూడా నేను టికెట్ ఇప్పించుకోలేకపోయా. చాలా బాధగా ఉంది. ఇక్కడి నాయకులు ఏవిధంగా నాకు అన్యాయం చేస్తున్నారో అధిష్ఠానానికి తొందర్లో లేఖ రాద్దాం అనుకుంటున్నా..’ అని ఆడియోలో ఉంది.

Comments are closed.