https://oktelugu.com/

మమతా బెనర్జీ హ్యాట్రిక్‌ కొట్టేనా..! : బెంగాల్ లో గెలుపెవరిది?

పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌ రిలీజ్‌ అయింది. మొత్తం ఎనిమిది దశల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్నాయి. తొలిదశ ఎన్నికలు మార్చి 27 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మే 2వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. అంటే మొత్తం 35 రోజులకు పైగా సమయం ఉంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో ఈసారి పోరు హోరాహోరీగా సాగుతోంది. ముఖ్యంగా ఈసారి బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ దృఢ సంకల్పంతో ఉంది. 2011లో ఒక్కస్థాన కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : March 2, 2021 / 01:37 PM IST
    Follow us on

    పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే షెడ్యూల్‌ రిలీజ్‌ అయింది. మొత్తం ఎనిమిది దశల్లో ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్నాయి. తొలిదశ ఎన్నికలు మార్చి 27 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. మే 2వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. అంటే మొత్తం 35 రోజులకు పైగా సమయం ఉంది. 294 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఈ రాష్ట్రంలో ఈసారి పోరు హోరాహోరీగా సాగుతోంది. ముఖ్యంగా ఈసారి బెంగాల్‌లో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ దృఢ సంకల్పంతో ఉంది.

    2011లో ఒక్కస్థాన కూడా గెలుచుకోలేని బీజేపీ.. 2016లో మూడు స్థానాలకు పరిమితమైంది. ఈసారి 200కు పైగా స్థానాలను లక్ష్యంగా పెట్టుకుంది. అంతేకాదు అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఆరాటపడుతోంది. కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టేందుకు సిద్ధమైంది. 2011లో 184 స్థానాలతో అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది మమతా బెజర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌. ఆ తరువాత ఎన్నికల్లో 211 స్థానాలు సొంతం చేసుకుంది. ఈసారి కూడా అధికార పీఠాన్ని కాపాడుకొని హ్యాట్రిక్‌ కొట్టాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే.. తన మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీని ముందుంచి వ్యూహాలను పదును పెడుతున్నారు మమత.

    ఈసారి ఎన్నికలు జరుగుతున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో పశ్చిమ బెంగాల్‌ పరిస్థితి విభిన్నంగా ఉంది. ఇక్కడి జనాభాలో దాదాపు 27 శాతం ముస్లిములు, మరో 30 శాతం మతువాలు ఉంటారు. గత ఎన్నికల్లో ఈ రెండు వర్గాలూ చాలావరకు తృణమూల్‌ కాంగ్రెస్‌కే అండగా నిలిచాయి. ఫలితంగా ఆ పార్టీకి భారీ ఆధిక్యం దక్కిందని చెప్పొచ్చు. ఎన్నికల్లో బలమైన ప్రభావం చూపే ఈ రెండు వర్గాలు ఈ సారి ఎటు వైపు మొగ్గుచూపుతాయా అనేది సందిగ్ధం నెలకొంది. మొన్నటి ఎన్నికల వరకు కూడా బెంగాల్‌లో ముస్లిములకు ప్రత్యేకంగా ప్రాతినిధ్యం వహించే పార్టీలేవీ బరిలో లేవు. కానీ.. ఈసారి ఎన్నికల్లో ఏఐఎంఐఎం కూడా బరిలో నిలుస్తోంది.

    అంతేకాదు.. బెంగాల్‌లో చాలా ప్రముఖమైన ఫుర్‌‌పురా షరీఫ్‌కు చెందిన 34 ఏళ్ల మత గురువు అబ్బాస్‌ సిద్ధిఖీ ‘ఇండియన్‌ సెక్యులర్‌‌ ఫ్రంట్‌’ పేరుతో కొత్త పార్టీ పెట్టారు. మమత పట్ల వ్యతిరేకంగా ఉన్న ఆయన.. ముందుగా మహాకూటమి వైపు మొగ్గుచూపారు. కానీ.. కాంగ్రెస్‌ పార్టీ స్థానిక నాయకత్వంపై విముఖత చూపుతూ దానికీ దూరంగానే ఉంటున్నారు. సోషల్‌ మీడియాలో బాగా ప్రభావం చూపించే ఈ యువ మత గురువు నిర్వహించే బహిరంగ సభలకూ జనం భారీగానే వస్తున్నారు. 201 ఎన్నికల్లో 38.93 శాతం, 2016లో 44.09 శాతం చొప్పున ఓట్లు సాధించిన మమతకు ముస్లిం ఓట్లు కూడా అండగా నిలిచాయి. ఇప్పుడవి వేర్వేరు పార్టీల మధ్య చీలితే తృణమూల్‌కు నష్టం తప్పదు.

    తూర్పు బెంగాల్‌కు చెందిన మతువాలు–బంగ్లాదేశ్‌ విభజన తర్వాత పశ్చిమ బెంగాల్‌కు వలస వచ్చారు. ఎస్సీ వర్గానికి చెందిన వీరు కనీసం ఆరు పార్లమెంటరీ స్థానాల్లో ప్రభావం చూపగలరు. రాష్ట్ర జనాభాలో మూడు కోట్ల మందికి పైగా ఉన్న మతువాల మొగ్గు కూడా కీలకం కానుంది. వారిలో సుమారు రెండు కోట్ల మందికి ఓటు హక్కు ఉంది. తాము అధికారంలోకి వస్తే మతువాలకు పౌరసత్వం కల్పిస్తామని ఓ వైపు బీజేపీ హామీనిస్తోంది. సీఏఏ, ఎన్‌ఆర్‌‌సీలను అమలు చేస్తామని కమలనాథులు అంటున్నారు. మతువా వర్గానికి అండగా ఉన్న బోరో మా, ఆమె మనువడు శంతను ఠాకూర్‌‌ బహిరంగంగా బీజేపీకి మద్దతు ప్రకటించారు. మొదట్లో కాంగ్రెస్‌ పార్టీకి, తరువాత వామపక్షాలకు మద్దతుగా ఉన్న ఈ వర్గం ఇప్పుడు బీజేపీ వైపు మొగ్గు చూపింది.

    ఇదిలా ఉండగా.. పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ఫలితాలపై వ్యూహకర్తల ధీమా మాత్రం ఒకలా ఉంది. 2011లో 4.06 శాతం ఓట్లు సాధించిన బీజేపీ, 2016లో 10.16 శాతం వద్ద ఆగింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 40.64 శాతం ఓట్లు సాధించి 18 స్థానాలను కైవసం చేసుకొంది. దశాబ్దాల తరబడి పశ్చిమ బెంగాల్‌పై ఎర్రజెండా ఎగరేసిన సీపీఐ(ఎం) పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. 2011లో 30.08 శాతం ఓట్లున్నా.. ఐదేళ్ల తర్వాత ఆ బలం 19.75 శాతానికి పడిపోయింది. కాంగ్రెస్‌ పార్టీ సొంతంగా ప్రభావం చూపగల పరిస్థితిలో అయితే లేదు. మైనార్టీలలో మెజార్టీ (ముస్లిములు), మెజార్టీలో మైనార్టీలో భాగం (హిందువులు) ఓట్లు తమకే పడితే బీజేపీ కలలు కల్లలేనని తృణమూల్‌ వ్యూహకర్తలు ధీమాతో ఉన్నారు.

    రాష్ట్రానికి పశ్చిమాన జంగల్‌మహల్‌, ఉత్తరాన కూచ్‌బిహార్‌‌ ప్రాంతాలు ఉన్నాయి. ఆ రెండు ప్రాంతాలు కూడా తమను ఆదుకుంటాయని బీజేపీ నేతలు ధీమాతో ఉన్నారు. దాదాపు 60 అసెంబ్లీ నియోజకవర్గాలున్న జంగల్‌మహల్‌లో గట్టి ప్రభావం చూపగల ‘అధికారి’ కుటుంబం కాషాయ కండువా కప్పుకోవడం ఆ పార్టీకి కలిసొచ్చే ప్రధాన అంశం. మరోవైపు.. మమత పార్టీ తృణముల్‌ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వర్క్‌ చేస్తున్న ప్రశాంత్‌ కిషోర్‌‌ కూడా ధీమాతో ఉన్నారు. ఈసారి బీజేపీ రెండంకెల స్థానాలకే పరిమితం అవుతుందని అంటున్నారు. కొన్ని స్థానాలు తగ్గినా.. దీదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమంటున్నారు. బీజేపీకి వంద సీట్లకు అటుఇటుగా రావొచ్చని ఎన్నికల పండితులు కూడా అభిప్రాయపడుతున్నారు.

    మరోవైపు.. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి మూడోసారి అధికారంలోకి రావాలని మమత చూస్తున్నారు. ఇందుకోసం పశ్చిమ బెంగాల్ లో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న బీజేపీని ఓడించేందుకు మమత అన్ని ఎత్తులను వేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే.. మమత బెనర్జీకి బెంగాల్‌లో కొత్త మిత్రుడు దొరికాడు. బీహార్ ఎన్నికల్లో పోరాటపటిమను ప్రదర్శించి మెప్పించిన ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌తో దోస్తీ కట్టేందుకు మమత సిద్ధం అవుతున్నారు. బెంగాల్ ఎన్నికల్లో కొత్తగా బరిలోకి దిగేందుకు తేజస్వి యాదవ్ సిద్దమైన సంగతి తెలిసిందే. బెంగాల్‌లో బీహార్ ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల నుంచి పోటీ చేయాలని ఆర్జేడీ చూస్తోంది. 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేసేందుకు తేజస్వి యాధావి సిద్ధమౌతున్నారు. ఈరోజు సాయంత్రం మమత బేజార్జీతో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ భేటీ కాబోతున్నారు. రెండు పార్టీలు పొత్తు పెట్టుకొని బీజేపీని ఓడించాలని ఆలోచన చేస్తున్నాయి. అదే విధంగా.. సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ సైతం మమత బెనర్జీకి సపోర్ట్ చేస్తుండటం విశేషం. యూపీలో సమాజ్ వాదీ పార్టీతో, బీహార్‌‌లో ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్, పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మాత్రం వామపక్షాలతో పొత్తు పెట్టుకోవడం విశేషం.

    -శ్రీనివాస్.బి