
చిత్తూరు జిల్లా మనదపల్లెలో ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పెద్ద కూతురు అలేఖ్య గురించి షాకింగ్ విషయాలు పోలీసుల విచారణలో బయటపడుతున్నాయి. ఈ మొత్తం ఘటనలో పెద్దమ్మాయి అలేఖ్య (27)నే కారణమని తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.
అలేఖ్య చదువులో నంబర్ 1 స్టూడెంట్. చిన్న చిన్న మ్యాజిక్ లు చేస్తూ తల్లిదండ్రులను ఆకట్టుకునేదట.. దీంతో తమ కూతురికి నిజంగానే శక్తులు ఉన్నాయని తల్లిదండ్రులు నమ్మారు. తమ ఇద్దరు కూతుళ్లు సాక్షాత్తూ శివుడు, పార్వతులని వాళ్ల తల్లిదండ్రులు పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతులు పోలీసులకు చెప్పారు.
రెండు వారాల క్రితం పెంపుడు కుక్కతో చిన్న కూతురు సాయిదివ్య బయటకు వెళ్లింది. ఏదో ముగ్గు మధ్యలో మంత్రించిన నిమ్మకాయను తొక్కిందట.. అప్పటి నుంచి తాను చనిపోతానంటూ భయంతో ఏడుస్తూ ఉండేది. బాధగా ఉంటే చనిపోవాలని.. తాను మళ్లీ బతికిస్తానని ఆలేఖ్య రెచ్చగొట్టింది.
దివ్యను చంపేయాలని.. తాను బతికిస్తానని అలేఖ తల్లిదండ్రులను నమ్మబలికింది.. దీంతో ఇక లాభం లేదనుకొని తల్లిదండ్రులు డంబెల్ తో తలపై మోదీ చంపేశారు. తర్వాత శూలంతో పొడిచి ముఖాన్ని చెక్కేశారు.
ఇది జరిగిన నాలుగు గంటల తర్వాత.. సాయంత్రం 5 గంటల సమయంలో దివ్యను చంపినట్టుగానే తనను కూడా చంపేయాలని పెద్ద కూతురు అలేఖ్య తల్లిదండ్రులను కోరింది. తాను కూడా చనిపోయి చెల్లి దివ్యను తిరిగి తీసుకొస్తానని తల్లిదండ్రులను నమ్మించింది. తాను పునర్జన్మలపై ప్రయోగాలు చేశానని.. పెంపుడు కుక్కను ఇలాగే చంపేసి బతికించానని తల్లిదండ్రులకు అలేఖ్య నమ్మబలికింది.తల్లిదండ్రులు నమ్మి అలేఖ్యను కొన్ని పూజలు చేసి డంబెల్ తో కొట్టి చంపారు. ఇలా చెల్లిని తీసుకొస్తానని తల్లిదండ్రుల చేతిలో అలేఖ్య కూడా హతమైంది. పునర్జన్మల విశ్వాసమే వీరి హత్యలకు కారణంగా తేలింది.
అలేఖ సోషల్ మీడియా అకౌంట్స్ చూసిన పోలీసులకు ఇదే అర్థమైంది. అలేఖ్యకు విపరీతమైన భక్తి విశ్వాసాలు ఉన్నట్లు పోస్టులను బట్టి అర్థమవుతోంది. వారం రోజులుగా ప్లాన్ ప్రకారమే అలేఖ ఇలా చేసింది. 22న అలేఖ్య తన పేరును ‘మోహిని’గా మార్చుకుంది. ప్రపంచ సన్యాసిని అని పేర్కొంది. సద్గురును ఫాలో అయ్యి గతంలో చావుపుట్టుకలు, పునర్జన్మల గురించి పోస్టులు చేసింది. దీన్ని బట్టి పునర్జన్మల పిచ్చిలో పడి అలేఖ తను చెల్లిని, తనను చంపుకుందని పోలీసుల విచారణలో తేలింది.